దేశవ్యాప్తంగా బీజేపీ ‘తిరంగా యాత్ర’

దేశవ్యాప్తంగా బీజేపీ ‘తిరంగా యాత్ర’
  • ఆపరేషన్ సిందూర్’ను ప్రశంసిస్తూ 11 రోజులపాటు ప్రోగ్రామ్స్
  • హర్యానా, అరుణాచల్, గుజరాత్​లో యాత్ర స్టార్ట్ చేసిన సీఎంలు
  • ఢిల్లీలో 'శౌర్య సమ్మాన్ యాత్ర' పేరిట కర్తవ్య పథ్‌‌‌‌పై ర్యాలీ

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ను, భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను ప్రశంసించడంతోపాటు టెర్రరిజానికి వ్యతిరేకంగా మన జవాన్లు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ..'తిరంగా యాత్ర' పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. 

మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర..11 రోజుల పాటు(మే 23 వరకు) వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది. యాత్రలో  భాగంగా..పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌‌‌‌లోని టెర్రరిస్టుల శిబిరాలను ధ్వంసం చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రజలకు బీజేపీ నేతలు తెలియజేయనున్నారు. 

దేశంలోని అన్ని సిటీల్లో, నగరాల్లో పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగులు, బైక్ ర్యాలీలు, జెండా ఎగురవేత కార్యక్రమాలు, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశభక్తి, త్రివర్ణ పతాకం పట్ల గౌరవం పెంచే ప్రోగ్రాములు చేపట్టనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌‌‌‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సీనియర్ నాయకులు ఈ నెల11న యాత్ర నిర్వహణపై చర్చించారు. జేపీ నడ్డా, సంబిత్ పాత్ర, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ వంటి నేతలు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. ఈ యాత్ర రాజకీయ లాభాల కోసం కాదని..సాయుధ బలగాల ధైర్యాన్ని ఏకం చేయడం కోసమేనని బీజేపీపేర్కొంది. 

‘తిరంగా యాత్ర’ ఎక్కడెక్కడ జరిగిందంటే..! 

హర్యానాలో సీఎం నయాబ్ సింగ్ సైనీ.. పంచకులా నుంచి తిరంగా యాత్రను ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ..వాలోంగ్‌‌‌‌లో యాత్రను నిర్వహించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్..వ్యాసవాడీ నుంచి తిరంగా యాత్రను ప్రారంభించారు. కర్నాటకలో మే 15 నుంచి యాత్ర నిర్వహించనున్నారు. బిహార్‌‌‌‌లో  బుధవారం నుంచి యాత్రను ప్రారంభిస్తారు.ఢిల్లీ ప్రభుత్వం కర్తవ్య పథ్‌‌‌‌పై 'శౌర్య సమ్మాన్ యాత్ర' పేరిట ర్యాలీని నిర్వహించింది.