న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. అలాగే ఇకపై ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒంటిరిగానే పోటీ చేసి అధికారంలోకి రావాలనేది తమ లక్ష్యమన్నారు. తెలంగాణ, పంజాబ్ లో ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై తమ ఫోకస్ ఉందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. మంగళవారం ఢిల్లీలో అమిత్ షా మీడియాతో చిట్ చాట్ చేశారు.
నియోజకవర్గాల పునర్ విభజన, మహిళా రిజర్వేషన్లు పెంపు బిల్లు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, తెలంగాణలో పొత్తులు సహా పలు అంశాలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న పంజాబ్ లో అకాళీ దళ్ సహా అక్కడ ఏ పార్టీతో పొత్తు ఉండదన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేస్తామని తెలిపారు. దేశ సరిహద్దు ప్రాంతాలన్నిటిని అత్యాధునిక టెక్నాలజీతో కట్టుదిట్టం చేయబోతున్నట్టు వెల్లడించారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు నో సీరియస్..
సభలో సరిపడా మద్దతు లభించగానే నియోజకవర్గాల పునర్ విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ లో పెండింగ్ లో ఉందన్నారు. నియోజకవర్గాల పునర్ విభజనలో ఎవరికీ, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని తెలిపారు. లోక్ సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లులో పొందుపరిచినట్లు చెప్పారుడీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదన్నారు.
