హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా సింగరేణి ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేందుకు కమిటీ సిద్ధమైంది. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై త్వరలోనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పర్యటించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోనుంది.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు, టాస్క్ ఫోర్స్ కమిటీ కన్వీనర్ సీహెచ్ విఠల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ , ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ వర్చువల్ గా పాల్గొన్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి నివేదిక రూపొందించాలని కమిటీ నిర్ణయించింది. దీంతోపాటు కేసీఆర్ పాలనలో ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపైన దృష్టి పెట్టాలని, ముఖ్యంగా సింగరేణి నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నందున దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వంపై చట్ట, న్యాయపరమైన పోరాటం చేయాలని కమిటీ తీర్మానించింది.
