అనుప్రియాకు మంత్రి పదవి ఇచ్చి నా కుమారుడికి ఇవ్వరా?

అనుప్రియాకు మంత్రి పదవి ఇచ్చి నా కుమారుడికి ఇవ్వరా?
  • తప్పు దిద్దుకోకుంటే యూపీ ఎన్నికల్లో మూల్యం తప్పదు
  • బీజేపీకి మిత్రపక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ హెచ్చరిక

గోరఖ్‌పూర్: కేంద్ర కేబినెట్ విస్తరణలో తన కుమారుడికి స్థానం కల్పించకపోవడంపై బీజేపీ మిత్ర పక్షం నిషాద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని ఇప్పటికైనా సరిద్దుకోకపోతే రాబోయే యూపీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ‘‘ఆప్నా దళ్ నేత అనుప్రియా పటేల్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నప్పుడు నా కుమారుడు, గోరఖ్‌పూర్ ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను ఎందుకు తీసుకోరు? నా కుమారుడు ప్రవీణ్​ నిషాద్‌కు యూపీలోని 160 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పట్టు ఉంది. కానీ అనుప్రియాకు అతి కొద్ది చోట్ల మాత్రమే బలం ఉంది’ అని సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటికే నిషాద్ కమ్యూనిటీ ప్రజలు బీజేపీకి దూరమవుతున్నారని, ఆ పార్టీ పెద్దలు ఇప్పటికైనా తమ తప్పులను దిద్దుకోకుంటే యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. తన అభిప్రాయాలను ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వివరించారని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని, ప్రవీణ్​ నిషాద్‌కు సరైన స్థానం కల్పిస్తారని నమ్ముతున్నానని తెలిపారు. 
ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎంపీ నిషాద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో మా పొత్తు కొనసాగుతుంది. మేం బీజేపీ వెంట ఉన్నాం. భవిష్యత్తులోనూ ఉంటాం. కానీ నిషాద్ కమ్యూనిటీ ఇప్పటికీ బీజేపీకి దూరం జరుగుతున్నారు. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ పార్టీలు మా కమ్యూనిటీని మోసం చేశాయి. ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేసిందని వాళ్లు ఫీల్ అవుతున్నారు” అని అన్నారు.