- వాతావరణం కూడా మాకు అనుకూలంగా ఉంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కామెంట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తమ పార్టీ అధికారం చేపట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, కార్యకర్తలు క్రమశిక్షణతో సిద్ధాంత పటిమతో ముందుకు సాగితే విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో జరిగిన సమావేశం నిర్ణయం మేరకు జిల్లా స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మండల స్థాయిలో ఇప్పటికే 50 వేల మందికి పైగా కార్యకర్తలు శిక్షణ పొందారని చెప్పారు. కార్యకర్తలకు రాజకీయ కార్యాచరణపై స్పష్టత ఇవ్వడమే ఈ వర్క్‌షాప్ ఉద్దేశమని వివరించారు. కొత్త పార్టీలు రావడం ప్రజాస్వామ్యంలో సహజమని వ్యాఖ్యానించారు. గతంలో కేఏ పాల్ పార్టీ పెట్టారని, ఇప్పుడు మరో కొత్త పార్టీ వచ్చిందని కవిత పార్టీని ఉద్దేశించి పేర్కొన్నారు. పుట్టబోయే బిడ్డకు కూడా మళ్లీ టీఆర్‌ఎస్ అని పేరు పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు.
ఢిల్లీకి పైసలు.. మరి ఉద్యోగుల మాటేమిటి?
తెలంగాణ నుంచి రూ.వెయ్యి కోట్లు ఢిల్లీకి పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని రాంచందర్ రావు అన్నారు. దీనిలో కనీసం రూ.500 కోట్లు రాష్ట్రంలోని ఉద్యోగుల సంక్షేమానికి ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు.

