మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో విజయకేతనం

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో విజయకేతనం
  • మరో  రెండు చోట్ల కీలకం కానున్న కాంగ్రెస్ 
  • కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌లో బీజేపీ, సిరిసిల్లలో బీఆర్ఎస్ గెలుపు  

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ సత్తా చాటింది. ఉమ్మడి జిల్లాలో రామగుండం కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, జగిత్యాల  మున్సిపాలిటీలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లాలోని రాయికల్‌‌‌‌, మెట్‌‌‌‌పల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కీలకంగా మారింది.  ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేసింది. మెట్‌‌‌‌పల్లిలో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంది.  సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలిచి ఉనికి చాటుకుంది.  

కరీంనగర్‌‌‌‌‌‌‌‌పై కాషాయ జెండా..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 66 స్థానాలకుగాను 30 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, 13 చోట్ల  కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 3 ఎంఐఎం, 2 ఫార్వర్డ్ బ్లాక్, 9 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.  గత మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంలో 12 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా  మేయర్ పీఠం దక్కించుకునే మెజార్టీ సాధించడం విశేషం. గతంలో 33 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.

 గత పాలకవర్గంలో కనీస ప్రాతినిథ్యం లేని కాంగ్రెస్ ఈసారి 13 చోట్ల గెలిచింది.  గతంలో ఆరుగురు ఎంఐఎం కార్పొరేటర్లు ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య సగానికి పడిపోయి ముగ్గురికి చేరింది. పార్టీ తరఫున తొలిసారిగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసపక్ష నేత అక్బరుద్దీన్ వచ్చి ప్రచారం  చేసినా గతం కంటే సీట్లు తగ్గడం ఆ పార్టీకి షాకిచ్చింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు చోట్ల గెలిచి గత స్థానాన్ని పదిలపరుచుకుంది. 

వ్యక్తిగత  ఇమేజ్‌‌‌‌తో 9 మంది కార్పొరేటర్లు ఇండిపెండెంట్లుగా గెలిచారు. వీళ్లలో చాలా మంది బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తొలిసారిగా బీజేపీ దక్కించుకోబోతోంది. ‌‌‌‌‌‌‌‌జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డుల్లో కాంగ్రెస్ 10,  బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 3, ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్ధానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్లతోపాటు ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. 

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్​ఘన విజయం

పెద్దపల్లి, వెలుగు: మున్సిపల్‌‌‌‌ ఎన్నికల ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌ ఘన విజయం సాధించింది. జిల్లాలోని కార్పోరేషన్​తో పాటు మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్​ ఎలాంటి ప్రభావం చూపలేదు. అక్కడక్కడక ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్​ అభ్యర్థులు విజయం సాధించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులకు గానూ కాంగ్రెస్​ 27, ఫార్వర్డ్​ బ్లాక్​ 5, బీఆర్ఎస్​, బీజేపీ 1, ఇండిపెండెంట్ల 2 గెలిచారు. సుల్తానాబాద్‌‌‌‌లో 15 వార్డులకుగానూ 12 కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాకులు ఒక్కో సీటు గెలిచాయి. మంథని మున్సిపాలిటీలో 13 సీట్లకు గాను కాంగ్రెస్​ 11 సీట్లు గెలుపొందగా, బీఆర్​ఎస్​, ఫార్వర్డ్​బ్లాక్​ ఒక్కో సీటు గెలిచాయి. బీజేపీ మంథనిలో తుడిచిపెట్టుకుపోయింది. 

 జగిత్యాల జిల్లాలో మూడు చోట్ల హస్తం.. 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్లలో కాంగ్రెస్ విజయం సాధించగా.. మెట్‌‌‌‌పల్లి , రాయికల్‌‌‌‌లో బీజేపీ పైచేయి కోసం ఆపరేషన్ మొదలైంది. జగిత్యాలలో కాంగ్రెస్ 23 స్థానాలు గెలిచి ముందంజలో నిలిచింది. సంజయ్‌‌‌‌కుమార్ వర్గానికి దగ్గరగా ఉన్న ఇండిపెండెంట్లు, ఎంఐఎం, బీజేపీ రెబల్స్‌‌‌‌తో కలిపి కాంగ్రెస్ బలం 30 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. చైర్మన్ పీఠం రేసులో మూలాస్తపు లావణ్య, సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లు వినిపిస్తున్నాయి. కోరుట్ల(33)లో కాంగ్రెస్ 18 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ దాటింది.

 చైర్మన్ కోసం అన్నం లావణ్య, శీలం జయలక్ష్మి, తిరుమల వసంత, పుప్పాల ఉమాదేవి, దాసరి సునీత రేసులో ఉన్నారు. మెట్‌‌‌‌పల్లి( 26)లో బీజేపీ 10 స్థానాలు గెలిచి పీఠం కైవసం కోసం కసరత్తు ప్రారంభించింది. ధర్మపురి అర్వింద్ నాయకత్వంలో చర్చలు వేగం పుంజుకున్నాయి. చెట్లపల్లి మీనా, ధర్మపురి స్వరూప పేర్లు ముందు ఉన్నాయి. రాయికల్‌‌‌‌ 12 వార్డులలో బీజేపీకి 5 సీట్లు రావడంతో మరో ఇద్దరి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్,- ఇండిపెండెంట్‌‌‌‌లతో చర్చలు జరుపుతూ పీఠంపై దృష్టి పెట్టింది. ధర్మపురి లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ సాధించగా, వేముల నాగలక్ష్మి, సంతోషి చైర్‌‌‌‌పర్సన్ రేసులోఉన్నారు.

రామగుండంలో కాంగ్రెస్‌‌‌‌దే మేయర్‌‌‌‌‌‌‌‌ పీఠం

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ సత్తా చాటింది. కార్పొరేషన్‌‌‌‌లో 60 డివిజన్లకు శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగగా.. అధికార పార్టీ 38 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీఆర్ఎస్​ 13 డివిజన్లలో గెలుపొందగా, ఆయా పార్టీలలో టిక్కెట్లు రాక ఆల్​ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​(ఏఐఎఫ్​బీ) నుంచి పోటీ చేసిన వారిలో ఆరుగురు గెలుపొందారు. బీజేపీ ఒక డివిజన్‌‌‌‌కే పరిమితమైంది. 28 ఏండ్ల తర్వాత సీపీఐ ఒక్క సీటు సాధించింది. కాగా ఫలితాలు వెల్లడైన కాసేపటికే 10వ డివిజన్​నుంచి గెలిచిన అడ్డాల గట్టయ్య(బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌) కాంగ్రెస్​పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే  ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. 

వేములవాడలో హస్తం.. సిరిసిల్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉండగా వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్‌‌‌‌కు మద్దతు తెలిపారు. కాగా సిరిసిల్లలో మాత్రం గులాబీ పార్టీ అత్యధిక వార్డుల్లో గెలిచింది. మున్సిపల్‌‌‌‌ పరిధిలో 39 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 27 వార్డుల్లో గెలుపొంది చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ పీఠం దక్కించుకుంది. కాంగ్రెస్‌‌‌‌ 6, బీజేపీ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. సిరిసిల్ల మున్సిపాలిటీపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో 9 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు స్వయంగా పర్యవేక్షించారు.