దేవుడిని పూజిస్తారు కాని.. రైతులను పట్టించుకోరు: రాహుల్ గాంధీ

దేవుడిని పూజిస్తారు కాని.. రైతులను పట్టించుకోరు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని రెండవ జ్యోతిర్లింగమైన బాబా మహాకాల్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. మహాకాల్‭కు చేరుకుని భోలేనాథ్ ఆశీస్సులు పొందారు. నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీ, ఎరుపురంగు అంగవస్త్రం, రుద్రాక్షలు ధరించి కనిపించారు. ఆలయ అర్చకులు ఆయనకు గంధం, తిలకం పెట్టారు. ఉజ్జయినిలో జైన మత గురువు ప్రజ్ఞా సాగర్ మహారాజ్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. రాహుల్ తో పాటు పీసీసీ చీఫ్ కమల్‌నాథ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జితూ పట్వారీ కూడా ఉన్నారు.

అంతకుముందకు నవంబర్ 25న మధ్యప్రదేశ్‭లోని ఓంకారేశ్వర్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇప్పటివరకు 2100 కిలోమీటర్లు నడిచారు. మహాకాల్ ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ... తపస్విలు పూజింబడే దేశం ఇది అని అన్నారు. తాను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నానని చెప్పారు. కాని జీవితంలో చివరి శ్వాస వరకు తపస్సు చేసే రైతులు, కార్మికులు - నిజమైన తపస్విలు అని.. వారి ముందు తాను చేసేది చాలా చిన్నది అన్నారు. అయితే అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందడం లేదని ఆయన ఎత్తిచూపారు. బీజేపీ చేతులెత్తి దేవుడిని పూజిస్తుంది కాని.. నిజమైన తపస్వీలు అయిన రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, విద్యావంతులైన యువకుల భవిష్యత్తును నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.