- ఆటోలో సామాన్యుడిలా వచ్చిన రాంచందర్ రావు
- బారికేడ్లు నెట్టుకొని దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు.. నేతల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటూ సోమవారం నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు నేతలు, కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వవాదం, తోపులాట జరిగింది.
ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నా.. వారి కళ్లుగప్పి బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఒక సామాన్యుడిలా ఆటోలో అసెంబ్లీ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. ఆటో దిగి నేరుగా అసెంబ్లీ గేటు ముందు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రాంచందర్ రావుతో పాటు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన రాంచందర్ రావును బీజేపీ ఎమ్మెల్యేలు వెంకట్ రమణారెడ్డి, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్త పరామర్శించారు.
26 నెలల పాలనలో అన్నీ అబద్ధాలే
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 26 నెలలవుతున్నా ప్రజలకిచ్చిన 6 హామీలను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల టైంలో రైతులు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్ల పేరుతో ఆశలు చూపి గద్దెనెక్కారని.. తీరా అధికారం చేపట్టాక గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు అర్ధరాత్రి నుంచే బీజేపీ నేతలను గృహనిర్బంధం చేశారని.. వందలాది మందిని అరెస్ట్ చేశారని తెలిపారు.హామీలను అమలు చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాంచందర్‌రావు అరెస్ట్ దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు.
