చర్చ లేకుండనే.. పార్లమెంట్‌‌‌‌లో మరో బిల్లు పాస్..MSME బిల్లుకు లోక్‌‌‌‌సభ ఆమోదం

చర్చ లేకుండనే.. పార్లమెంట్‌‌‌‌లో మరో బిల్లు పాస్..MSME బిల్లుకు లోక్‌‌‌‌సభ ఆమోదం
  • ఉభయసభల్లో కొనసాగిన గందరగోళం 
  • విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌పై హోం మంత్రి జవాబివ్వాలని ప్రతిపక్షాల పట్టు 
  • అమిత్ షా సరైన సమయంలో సమాధానం ఇస్తారు: రిజిజు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌‌‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, గందరగోళం కొనసాగడంతో ఎలాంటి చర్చ జరగకుండానే మరో బిల్లు పాస్ అయింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్ డెవలప్‌‌‌‌మెంట్(సవరణ) బిల్లు, 2026కు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ లోక్‌‌‌‌సభలో ప్రవేశపెట్టారు. 

సోమవారం రాజ్యసభ ఈ బిల్లును క్లియర్ చేయగా.. శుక్రవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌‌‌‌సభ కూడా ఆమోదించింది. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఎదుర్కొంటున్న బిల్లుల చెల్లింపుల ఆలస్యాన్ని నివారించడానికి, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఎంఎస్ఎంఈల నగదు సరఫరా (క్యాష్ ఫ్లో)ను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్​ఈలు) తమ కొనుగోలు ఇన్‌‌‌‌వాయిస్‌‌‌‌లన్నింటినీ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారానే విధిగా చెల్లించాలని ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. 

అలాగే, ఏవైనా వివాదాలు తలెత్తితే 90 రోజుల్లోగా మధ్యవర్తిత్వం (మీడియేషన్) పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. వివాదానికి సంబంధించిన అప్పీల్ ప్రక్రియ ఆరు నెలలకు పైగా పెండింగ్‌‌‌‌లో ఉంటే, వివాదాస్పద మొత్తంలో కనీసం 50 శాతాన్ని కోర్టులు ఆయా ఎంఎస్ఎంఈలకు విడుదల చేయాల్సి ఉంటుంది. చిన్నపాటి రిజిస్ట్రేషన్ లేదా రిపోర్టింగ్ లోపాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించకుండా, వాటిని గ్రేడెడ్ పరిపాలనా హెచ్చరికలుగా గుర్తిస్తూ రూ. వెయ్యి నుంచి రూ. లక్ష వరకు జరిమానాలుగా మార్చారు. 

కాగా, ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్యే లోక్‌‌‌‌సభ ఈ బిల్లును ఆమోదించింది. భారత జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం 31 శాతం వాటాను కలిగి ఉండగా, తయారీ రంగంలో 36 శాతం, ఎగుమతుల్లో 41 శాతం భాగస్వామ్యాన్ని అందిస్తోంది. బిల్లు ఆమోదం తర్వాత  మంత్రి జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ.. 2014–15లో ఎంఎస్ఎంఈలకు లభించిన బకాయి రుణాలు రూ. 10 లక్షల కోట్లుగా ఉంటే.. నేడు అది రూ. 38.35 లక్షల కోట్లకుపైగా పెరిగిందన్నారు. ఇది ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ ప్రవాహం నిలకడగా పెరుగుతోందని చూపిస్తున్నదని పేర్కొన్నారు.

లోక్‌‌‌‌సభ స్పీకర్ తో అమిత్​షా భేటీ

విద్యార్థులపై పోలీసుల చర్యలు, రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పార్లమెంటులో ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీ దాదాపు గంటపాటు సాగింది. అనంతరం, పార్లమెంట్ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో అమిత్​షాతో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సమావేశమయ్యారు.   

ఉభయసభలు సోమవారానికి వాయిదా

లోక్‌‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్, రామమందిర విరాళాల దొంగతనం అంశాలపై ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం కూడా ఉభయ సభల్లో నిరసనలు కొనసాగించారు. నీట్ పేపర్ లీక్‌‌‌‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన బలప్రయోగంపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు  డిమాండ్ చేశాయి.  12 గంటలకు ప్రారంభమైన జీరో అవర్ 16 నిమిషాల్లోనే ముగిసింది. ఆ తర్వాత సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనలకు దిగడంతో సభా కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి.  

ఎవరు రిప్లై ఇవ్వాలో ప్రతిపక్షాలు నిర్ణయించలేవు: రిజిజు 

సభకు ఏ మంత్రి రావాలి.. ఎవరు సమాధానం చెప్పాలనేది ప్రతిపక్షాలు నిర్దేశించలేవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నీట్​పేపర్ లీక్‌‌‌‌కు వ్యతిరేకంగా గత నెలలో నిరసన తెలిపిన విద్యార్థుల పట్ల పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని పార్లమెంట్​ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ అంశంతో పాటు ఇతర కారణాల వల్ల జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు తరచూ వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సభకు ఆటంకం కలిగించడం ఆపాలని ప్రతిపక్షాలపై కిరణ్ రిజిజు శుక్రవారం లోక్​సభలో తీవ్రంగా స్పందించారు. 

సరైన సమయంలో అమిత్ షా సభకు హాజరై సమాదానం చెప్తారని ఆయన తెలిపారు. అమిత్ షా ప్రతిరోజూ పార్లమెంటుకు వస్తారని.. రాత్రి వరకు ఇక్కడే ఉంటారని తెలిపారు. ‘అమిత్ షా పేరు వింటేనే టెర్రరిస్టులు వణుకుతారు. అమిత్ షా సమాధానం ఇచ్చిన రోజు మీరు దాన్ని జీర్ణించుకోలేరు ’ అని రిజిజు వ్యాఖ్యానించారు. 

దీంతో అధికార పక్షసభ్యులు బల్లలు చరిచి ఆయనకు మద్దతు తెలిపారు. నిబంధనల ప్రకారం ఏ మంత్రికి చెందిన బిజినెస్ జాబితాలో ఉంటుందో ఆ మంత్రినే సభకు వస్తారని, ఏ మంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలో నిర్ణయించేది ప్రభుత్వం, స్పీకర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.