న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీలను నిరక్షరాస్యులను చేసి కీలుబొమ్మలుగా మార్చాలన్నదే ప్రధాని మోదీ, బీజేపీ ఆలోచన అని తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్ మెంట్ కో –ఆర్డినేటర్ మందుల సూర్య కిరణ్ విమర్శించారు. ఎస్సీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి, వారి అభివృద్ధికి సహకరిస్తే... దేశంలో చాలా మార్పులు వస్తాయన్నారు. అయితే సమానత్వంతో కూడిన అలాంటి అభివృద్ధిని బీజేపీ కోరుకోవడం లేదన్నారు.
దళితుల ఎదుగుదలను అడ్డుకునేందుకే రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు బీజేపీ తెరలేపిందని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సూర్య కిరణ్ మీడియాతో మాట్లాడారు.రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇందిరా భవన్‌లో జరిగిన ఎస్సీ సెల్ జాతీయ స్థాయి సమావేశంలో తాము పాల్గొన్నట్లు సూర్య కిరణ్ చెప్పారు.
దేశంలో దళితుల అణచివేతకు బీజేపీ వేస్తున్న ప్రణాళికలు, వ్యూహాలపై సమావేశంలో రాహుల్ గాంధీ తమకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. దళితులను మరోసారి అంటరాని వారిగా ముద్రించి, వారిని నిర్వీర్యం చేయాలనే బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టాలని రాహుల్ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
బీజేపీ మనువాద ఆలోచనలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు త్వరలోనే తెలంగాణలోని జిల్లా, మండలాల వారీగా ఎస్సీ కమిటీలను వేయనున్నట్లు చెప్పారు. దళితులను అన్ని రంగాల్లో చైతన్య పరుస్తూ, వారి ఐక్యత, అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు నిర్వహించనున్నట్లు సూర్య కిరణ్ పేర్కొన్నారు.
