వెస్ట్ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

వెస్ట్ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

కోల్‎కతా: వెస్ట్ బెంగాల్‏లో టీఎంసీ కంచుకోటలను బద్దలు కొడుతూ బీజేపీ అఖండ విజయం సాధించింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనను గద్దె దింపి బెంగాల్ గడ్డపై తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి బీజేపీ హైకమాండ్ ముహూర్తం ఫిక్స్ చేసింది. 2026, మే 9న బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. జాతీయ గీతం జనగనమణ రచయిత రవీంద్రనాధ్ ఠాగూర్ జయంతి ఇదే రోజు కావడం గమనార్హం.

 అందనిద్రాక్షగా ఉన్న బెంగాల్‎లో ఎట్టకేలకు విజయం సాధించిన బీజేపీ.. సీఎం అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. సీఎం మమత బెనర్జీని మట్టికరిపించిన సువేందు అధికారి, బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కీలక మహిళా నాయకురాలు అగ్నిమిత్ర పాల్ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎవరూ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించనున్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానని ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అద్భుత విజయంతో బీజేపీ చరిత్ర సృష్టించింది. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ సర్కారు15 ఏండ్ల పాలనకు చరమగీతం పాడింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 294 సీట్లకుగాను 293 స్థానాలకు ఫలితాలను ఈసీ ప్రకటించింది. బీజేపీ ఏకంగా 206 సీట్లలో గెలిచి తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.

 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీస మెజార్టీ148 సీట్లను సునాయాసంగా దాటేసింది. టీఎంసీ 81 సీట్లకే పరిమితమైపోయింది. సీఎం మమతా బెనర్జీ కూడా బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోవడంతో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 15 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన టీఎంసీ రానున్న ఐదేండ్లు ప్రతిపక్ష పాత్ర పోషించనుంది.