- వర్సిటీల్లో వాళ్ల ఆగడాలు సాగనివ్వం: రాంచందర్‌రావు
- మార్చి 31 కల్లా నక్సల్స్‌రహిత దేశంగా భారత్
- ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం
- అంతమవుతున్నదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లోని అర్బన్ నక్సల్స్ (కొంతమంది ప్రొఫెసర్లను ఉద్దేశించి) పిల్లలకు చదువు చెప్పాలే తప్ప.. వారిని దేశద్రోహులుగా మార్చొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. లౌకికవాదులు, మేధావుల ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్స్.. విద్యాసంస్థలను రాజకీయ అడ్డాలుగా మార్చుతున్నారని ఆరోపించారు. మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టుల అంతం తప్పదని, ఇకనైనా అర్బన్ నక్సల్స్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే కేంద్రం మీ అంతు కూడా చూస్తుందని హెచ్చరించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కూకట్‌పల్లి ఇన్‌చార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, యువకులు బీజేపీలో చేరారు.
వారికి రాంచందర్‌రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతమవుతున్నదని, చైనాలోనే దాని ప్రభావం తగ్గిపోగా, రష్యా ముక్కలైపోయిందని చెప్పారు. ఈ వాస్తవాన్ని అర్బన్ నక్సల్స్ గుర్తించాలన్నారు. గత 45 ఏండ్లుగా మావోయిస్టులు సామాన్య ప్రజలను ఇన్‌ఫార్మర్ల నెపంతో చంపడం, బీజేపీ నేతలపై దాడులు చేయడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. వారి పోరాటం భూస్వాములను కాపాడడానికే తప్ప, పేదల కోసం కాదన్నారు. దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయడానికి కేంద్రం కంకణం కట్టుకున్నదని, మార్చి 31 నాటికి దేశాన్ని ‘మావోయిస్ట్ ముక్త్’గా మారుస్తామని చెప్పారు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ సత్ఫలితాలనిస్తున్నదని, తెలంగాణలోనూ టాప్ మోస్ట్ మావోయిస్టులు లొంగిపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేయడం దేశ పరువు తీయడమేనని అన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే వేరే చోట చూసుకోవాలి తప్ప అంతర్జాతీయ వేదికల వద్ద దేశాన్ని అవమానించడం తగదని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
