కృష్ణ జింకలకు భద్రతేదీ..? వేటగాళ్లు, రైతుల చేతిలో హతమవుతున్న అరుదైన జింకలు

కృష్ణ జింకలకు భద్రతేదీ..? వేటగాళ్లు, రైతుల చేతిలో హతమవుతున్న అరుదైన జింకలు
  • నారాయణపేట జిల్లాలో ముందుకుపడని రీహాబిలిటేషన్​ సెంటర్​ ఏర్పాటు
  • రెవెన్యూ డిపార్ట్​మెంట్​అవసరమైన భూమిని అప్పగించినా ప్రారంభం కాని పనులు
  • వేటగాళ్లు, రైతుల చేతిలో హతమవుతున్న అరుదైన జింకలు

మహబూబ్​నగర్, వెలుగు : కృష్ణ జింక(బ్లాక్​బక్​)కు భద్రత కరువైంది. తమ పంటలను నాశనం చేస్తున్నాయని కొందరు రైతులు పొలాల్లో ఉచ్చులు బిగిస్తుంటే మరో వైపు వేటగాళ్లు వాటిని తుపాకులతో కాల్చి చంపుతున్నారు. ఈ వ్యవహారం ఏండ్లుగా కొనసాగుతున్నా ప్రభుత్వాలు వీటిని రీహాబిలిటేషన్​ సెంటర్లకు తరలించే ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్​ అవుతున్నాయి.

12 వేలకు పైగానే కృష్ణ జింకలు.. 

నారాయణపేట జిల్లా తెలంగాణ-, కర్నాటక సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం మీదుగా తెలంగాణలోకి కృష్ణానది ప్రవహిస్తుంది. నీరు పుష్కలంగా ఉండడంతో ఏండ్లుగా ఇక్కడ కృష్ణ జింకలు ఉంటున్నాయి. పదేండ్ల కిందట వరకు వీటి సంతతి వందల సంఖ్యలో ఉండగా,  ఇప్పుడు దాదాపు 12 వేలకు పైగానే పెరిగినట్లు ఫారెస్ట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. సంతతి పెరగడంతో వీటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. దీంతో గడ్డి మైదానాలను వీడుతున్నాయి.

ఆహారం కోసం నారాయణపేట జిల్లాలోని మాగనూరు, కృష్ణ, నర్వ, మరికల్​, మక్తల్, ఊట్కూరు, నారాయణపేట, మహబూబ్​నగర్​ జిల్లాలోని దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్​ ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని వరి, పల్లీ, పత్తి, ఇతర పంటలపై మందలుగా వచ్చి దాడి చేస్తున్నాయి. పిలక దశ నుంచే మొక్కలను తింటుండడంతో రైతులకు తీవ్రంగా నష్టం వస్తోంది.

దీంతో వాటిని వదిలించుకునేందుకు కొందరు రైతులు పొలాల్లో కరెంటు షాక్​లు పెట్టడం, ఉచ్చులు బిగించడం చేస్తున్నారు. అవి చనిపోయాక వాటి ఆనవాళ్లు లేకుండా ఆ ప్రాంతాల్లోనే పాతి పెడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రాంతంలో జింకల సంతతి పెరగడంతో బయటి నుంచి వేటగాళ్లు కూడా వస్తున్నారు. గతంలో నర్వ, చిన్నచింతకుంట ప్రాంతాల్లో కూడా జింకలను వేటాడి చంపారు. తాజాగా మక్తల్​ ప్రాంతంలో జింకలను వేటాడి చంపిన ముఠాను గోల్కొండకు చెందిన టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

రీహాబిలిటేషన్​ సెంటర్ ఏమైంది..? 

కృష్ణ జింకల నుంచి తమ పంటలను కాపాడాలని ఈ ప్రాంత రైతుల దశాబ్దాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. కొద్ది నెలల కిందట జిల్లా మీదుగా సాగిన ‘భారత్​ జోడో యాత్ర’ సందర్భంగా ఈ ప్రాంత రైతులు రాహుల్​ గాంధీని కలిసి సమస్య వివరించారు. అప్పటి బీజేపీ తెలంగాణ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ జిల్లా మీదుగా నిర్వహించిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’లోనూ రైతులకు ఈ సమస్య గురించి ఆయనకు వివరించారు. కానీ ఇప్పటికీ రీ హాబిలిటేషన్​ సెంటర్ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు.

పది నెలల కిందట ఉమ్మడి మాగనూరు మండలంలోని సర్వే నంబరు 192లో 18.29 ఎకరాలు, 194లో 55.21 ఎకరాలను కలిపి మొత్తం 74.10 ఎకరాలను అప్పగించాలని రెవెన్యూ డిపార్ట్​మెంట్​ను రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించింది. ఇందులోనే చిన్న నీటి కుంట కూడా ఉంది. రెవెన్యూ ఆఫీసర్లు గత ఆగస్టులో ఈ భూమిని ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందో అక్కడ ఎర్ర జెండాలతో మార్కింగ్ కూడా  చేశారు. జీపీఎస్​ రికార్డ్​ పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత అడుగు ముందుకు పడడం లేదు. 

కొరవడిన పర్యవేక్షణ..

ఏండ్లుగా ఈ ప్రాంతాల్లో కృష్ణ జింకలు ఉంటున్నా ఫారెస్ట్​ ఆఫీసర్లు వాటిని పర్యవేక్షించడంలో ఫెయిల్​ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ జింకలు ఎక్కువగా ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి? జింకల మందలపై ఎవరైనా దాడులు చేస్తున్నారా? తదితర విషయాలపై నిఘా పెట్టడంలో విఫలమవుతున్నారు. జింకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాక్​ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఏండ్లుగా జింకలు వేటగాళ్ల బారిన పడుతూనే ఉన్నాయి. తాజాగా టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లు పట్టుకున్న ముఠా సభ్యులు ఏడాది కాలంగా మక్తల్​ ప్రాంతంలో దాదాపు పదికి పైగానే జింకలను చంపినట్లు తెలిసింది.