పాడవుతున్న పత్తి విత్తనాలు..వర్షాల్లేక రైతన్న విలవిల

పాడవుతున్న పత్తి విత్తనాలు..వర్షాల్లేక రైతన్న విలవిల

 

  • మూడు వారాలైనా జాడ లేని వానలు.. 
  • ఎల్ నినో ఎఫెక్ట్‌‌‌‌ తో నెమ్మదించిన సాగు పనులు
  • ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మట్టిపాలు.. 
  • మళ్లీ విత్తుకోవడానికి భారంగా మారిన పెట్టుబడులు

మహబూబ్​నగర్, వెలుగు :  మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యవసాయంపై ఎల్​ నినో ఎఫెక్ట్​ స్పష్టంగా కనిపిస్తోంది. వానాకాలం సీజన్​ ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా, ఇంత వరకు చినుకు జాడలేకపోవడంతో సాగు పనులు పుంజుకోవడం లేదు. మే చివరి వారంలో కురిసిన కొద్ది పాటి వర్షానికే రైతులు ఆశగా పత్తి విత్తనాలు విత్తుకోగా, ఇప్పుడు అవి మొలకెత్తడం లేదు. దాదాపు 60 శాతం విత్తనాలు భూమిలోనే కుళ్లిపోగా, రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడకుంటే మిగిలినత్తనాలు కూడా పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి రైతుల పరిస్థితి ఇలా.. 

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో వానాకాలం సీజన్​లో రైతులు ప్రధాన పంటగా వరి, రెండో ప్రధాన పంటగా పత్తి సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణపేట జిల్లాలో అత్యధికంగా 1.95 లక్షల ఎకరాల్లో, మహబూబ్​నగర్​ జిల్లాలో 95 వేల ఎకరాల్లో ఈ సీజన్​లో పత్తి పంట సాగువుతుందని వ్యవసాయ శాఖ అంచనా రూపొందించింది. అయితే రోహిణి కార్తెలో వేసవి దుక్కులు చేసుకున్న రైతులు, అదే నెలలో కురిసిన వర్షానికి పత్తి విత్తనాలను విత్తుకున్నారు.

ఆ తర్వాత వానల జాడ లేకుండా పోయింది. మృగశిర కార్తె రోజున జల్లులు పడినా.. ఆ వర్షం పత్తి పంటలకు జీవం పోయలేదు. విత్తనాలు విత్తుకొని మూడు వారాలు కావస్తున్నా వానలు పడకపోవడంతో అవిభూమిలోనే కుళ్లిపోతున్నాయి. నల్లగా మారి ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కువగా మక్తల్, నర్వ, మరికల్, చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర, ధన్వాడ, ఊట్కూరు, మాగనూరు, కోయిల్​కొండ మండలాల్లో ఉంది. 

పెట్టుబడులు మట్టిపాలు

గత సీజన్​లో పత్తి దిగుబడి బాగా రావడంతో ఈ సీజన్​లో కూడా రైతులు పత్తికే ప్రియారిటీ ఇచ్చారు. కొందరు రైతులు వారికున్న భూమితో పాటు పక్క భూములను కౌలుకు తీసుకొని వాటిలో కూడా పత్తి విత్తనాలను విత్తుకున్నారు. ఇందుకు గాను ఎకరాకు రూ.7,500 నుంచి రూ.8 వేల చొప్పున కౌలు చెల్లించారు.

ఇవి కాకుండా పత్తి సాగు పెట్టుబడుల కింద ఎకరా పొలాన్ని దుక్కులు చేసుకోవడానికి ట్రాక్టర్​కు రూ.3 వేల కిరాయి, విత్తనాలకు రూ.5 వేలు, గుంటుక కొట్టడానికి రూ.3 వేలు, విత్తనాలు వేయడానికి కూలీలకు రూ.1800 ఖర్చులు అయ్యాయి. ఇప్పుడు నాటిన విత్తనాలు ఎండిపోయి, భూమిలోనే కుళ్లిపోవడంతో రైతులకు ఎకరాపై దాదాపు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారు. 

60 మిల్లీ మీటర్ల వర్షం పడితేనే..

వర్షాలు పడకపోవడంతో మే చివరి వారంలో నాటిన పత్తి విత్తనాలు సాయిల్​ హీట్​ కారణంగా భూమి లోపలే మాడిపోయాయి. అయితే తొలకరి వర్షాలు పడినప్పుడు పత్తి విత్తనాలు విత్తుకోవద్దని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు సూచిస్తున్నారు. తొలకరి వర్షాల సమయంలో భూమి కేవలం రెండు అంగుళాలు మాత్రమే తడుస్తుందని, భూమి లోపల వేడి అలాగే ఉంటుందని చెబుతున్నారు. ఈ వేడి వాతావరణంలో విత్తనం నాటినప్పుడు ఆ వేడికి విత్తనాలు లోపలే మాడిపోయి నల్లగా మారుతాయని చెబుతున్నారు. ఒకటి, రెండు వర్షాలకు కాకుండా, 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, భూమి లోతు వరకు తడిచి చల్లబడిన తర్వాతే రైతులు పత్తి విత్తనాలను విత్తుకోవాలని సూచిస్తున్నారు.  

వర్షాలు రాకుంటే అంతే..

నాకు ఎకరా పొలం ఉంది. మరో ఎకరా కౌలుకు తీసుకొని పత్తి పెట్టిన. రెండు వారాల కిందట విత్తనాలు నాటిన. ఇంత వరకు వానలు పడలేదు. విత్తనాలు మొలకెత్తుతలేవు. కొన్ని విత్తనాలు భూమిలోనే నల్లగా మారి కుళ్లిపోయాయి. అక్కడక్కడా కొన్ని మొలకలు వచ్చాయి. ఒకటి, రెండు రోజుల్లో వర్షాలు రాకుంటే మొలిచిన మొక్కలు కూడా ఎండిపోతాయి. -హన్మంతు, రైతు, మరికల్​ గ్రామం, నారాయణపేట

జిల్లావిత్తనాలకే రూ.20 వేలు అయ్యింది..నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని, మొత్తం పది ఎకరాల్లో పత్తి పెట్టిన. కేవలం విత్తనాలకే రూ.20 వేలు అయ్యింది. ఐదు ఎకరాలకు కౌలు కింద రూ.40 ఇచ్చిన. పత్తి విత్తనాలు నాటి రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు మొలకెత్తడం లేదు. వానలు పడకుంటే పంట కోసం పెట్టిన పెట్టుడబులు మట్టిల కలిసినట్లే. కొక్కు లక్ష్మణ్​, రైతు, ఊట్కూరు గ్రామం, నారాయణపేట జిల్లా