స్నాప్ చాట్​లో పరిచయం.. పర్సనల్ ఫొటోలతో బ్లాక్ మెయిల్

స్నాప్ చాట్​లో పరిచయం.. పర్సనల్ ఫొటోలతో బ్లాక్ మెయిల్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ చాటింగ్ యాప్​లో యువతితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి.. తనను కలవకపోతే ఆమె పర్సనల్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు తన ఫ్రెండ్స్ సాయంతో నిందితుడిని పట్టుకుని సైబర్​క్రైమ్ పోలీసులకు అప్పగించింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్​కు చెందిన ఓ యువతి సిటీకి వచ్చి ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. 3 నెలల కిందట స్నాప్​చాట్​లో అలీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నిరోజుల తర్వాత అలీ లవ్ ప్రపోజల్​ను ఆమె ముందుంచాడు. ప్రేమ పేరుతో ఆమెకు మరింత దగ్గరై  ప్రతిరోజు స్నాప్ చాట్​లో చాటింగ్ చేసేవాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు స్నాప్ చాట్​లో  వీడియో కాల్ చేసింది. అలీ దాన్ని రికార్డ్ చేశాడు. తనను కలవకపోతే ఆమె పర్సనల్ వీడియోలు, ఫొటోలను వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. 

దీంతో యువతి ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ కు తెలిపింది.  వాళ్ల సూచన మేరకు అలీని సిటీలోని ఓ పార్కు వద్దకు రమ్మని చెప్పింది. మంగళవారం అలీ పార్కు దగ్గరకు వచ్చాడు. అక్కడే ఉన్న బాధితురాలు, ఆమె ఫ్రెండ్స్ అతడిని పట్టుకుని సిటీ సైబర్ క్రైమ్ పీఎస్​కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచన మేరకు బాధిత యువతి షీ టీమ్స్ కు కంప్లయింట్ చేసింది. షీ టీమ్స్ పోలీసులు అలీపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇన్వెస్ట్ మెంట్ పేరుతో 20 లక్షలు కొట్టేసిన్రు

బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఆన్​లైన్​లో పార్ట్ టైమ్ జాబ్ ఇస్తామంటూ కొందరు వ్యక్తులు అతడిని సంప్రదించారు. తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయించి రెట్టింపు డబ్బు ఇచ్చారు. దీంతో బాధితుడు ఒకేసారి రూ.20 లక్షలను ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తులు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.