న్యూ ఢిల్లీ: గిగ్ వర్కర్ల సమస్యలను దగ్గరగా చూడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఒక్క రోజు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌గా మారారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో తన అనుభవాన్ని టీజర్ వీడియో రూపంలో షేర్ చేశారు.
ఆ వీడియోలో ఆయన బ్లింకిట్ యూనిఫాం, హెల్మెట్ ధరించి, డెలివరీ బ్యాగ్ తీసుకుని, మరో డెలివరీ పార్ట్‌నర్‌తో కలిసి స్కూటర్‌పై ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. స్టోర్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకుని, అపార్ట్‌మెంట్ల లిఫ్ట్ ఎక్కి, కస్టమర్ ఇంటి డోర్ బెల్ మోగించే సీన్‌తో వీడియో ముగుస్తుంది. చివర్లో "స్టే ట్యూన్డ్" అనే మెసేజ్ పెట్టారు. ఇది గిగ్ ఎకానమీలో డెలివరీ వర్కర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేయడానికి చేసిన ఒక ప్రయత్నమని ఆయన చెప్పారు.
గత నెలలో ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ 28 డెలివరీలు చేసి 15 గంటలు పనిచేసి కేవలం రూ.762 మాత్రమే సంపాదించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ విషయంపై రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మాట్లాడారు. తర్వాత ఆ డెలివరీ బాయ్ ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి, ఆయన సమస్యలను విన్నారు.
సోమవారం డెలివరీ ఏజెంట్‌గా మారి రోడ్లపై ట్రాఫిక్‌లో ప్రయాణించి.. 10-నిమిషాల డెలివరీ టైమ్‌లైన్స్ కారణంగా ఒత్తిడి, రోడ్ రిస్కులు, తక్కువ వేతనం, సామాజిక భద్రత లేకపోవడం వంటి వాటిని ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఆయన ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో గిగ్ వర్కర్లకు న్యాయమైన వేతనం, మానవీయ పని గంటలు, సామాజిక భద్రత కోసం జరుగుతున్న చర్చలను బలపరుస్తోంది.
