ఆలేరు మున్సిపాలిటీలోని బీఎల్వో ఓ ఓటరుకు ఫోన్ చేసి.. ‘మీ ఫారం ఇంకా రాలేదు. తెచ్చివ్వండి’ అంటూ ఆర్డర్ జారీ చేశారు. ‘అదేంటి మీరే వచ్చి తీసుకెళ్లాలి’గా అంటూ ఓటరు ప్రశ్నిస్తే.. ‘మేము రాలేం.. మీరే తీసుకొచ్చి ఇవ్వాలి’ అంటూ సదరు బీఎల్వో ఆన్సర్ ఇచ్చారు.
మరో ఓటరుకు ఇప్పటివరకూ ఎన్యూమరేషన్ ఫారం రాలేదు. ఎన్యూమరేషన్ ఫారాలు రాక పోవడంతో కొందరు ఆన్లైన్లో సబ్మీట్ చేశారు. ఇలాంటివి సంఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నో ఉన్నాయి.
యాదాద్రి, వెలుగు: పారదర్శకమైన ఓటరు జాబితా కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కొందరు బీఎల్వోల కారణంగా ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.
బీఎల్వోలు మీ ఇంటికే వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు.. తీసుకెళ్తారని ఎన్నికల కమిషన్ ఎన్నోమార్లు ప్రకటనలు జారీ చేసింది. కానీ గ్రౌండ్లో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కొందరు బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను అందరి ఓటర్ల వద్దకు వెళ్లి ఇవ్వడం కానీ, కొన్నిచోట్ల ఇచ్చిన ఫారాలను మళ్తీ తీసుకెళ్లడం కానీ చేయడకుండా ఫోన్ చేసి తమ వద్దకు వచ్చి ఇవ్వాలంటున్నారు.
ఫారాలను నింపడంలో అక్షరాస్యులే ఇబ్బంది పడుతున్న స్విచ్చువేషన్ ఉంటే ఇక నిరక్ష్యరాస్యులు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇతరుల సహకారంతో ఫారాలు నింపినప్పటికీ బీఎల్వోలు వాటిని తీసుకెళ్లడం లేదని, పైగా ‘ఫారాలు మాకు తెచ్చి ఇవ్వకుంటే మీ ఓటే పోతుంది’ అంటూ బెదిరిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
ఇక యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో 2,38,040 ఓటర్లు, భువనగిరిలో 2,21,903 ఓటర్లున్నారు. ఓటర్లకు వంద శాతం పంపిణీ చేశామంటూ జిల్లాలో లెక్కలు చూపిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొందరు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదని తెలుస్తోంది.
గ్రామాల్లోనే స్పీడ్..
సర్ ప్రక్రియ నిర్వహణ పట్టణాలతో పోల్చుకుంటే గ్రామాల్లోనే స్పీడ్‌గా జరుగుతోంది. రెండు నియోజకవర్గాల్లోని మూడు మున్సిపాలిటీలు, వాటి పరిధిలోని పోలింగ్సెంటర్లలో మాత్రం ఆలస్యంగా జరుగుతోంది. మొత్తంగా ఆలేరు నియోజకవర్గంలోని 309 పోలింగ్ సెంటర్లలోని 2,25,492 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు, భువనగిరిలోని 257 పోలింగ్ సెంటర్లలోని 1,99,945 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటిలైజేషన్ చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఆన్లైన్లో 2,172 మంది..
బీఎల్వోల నుంచి సరైన స్పందన కరువవడం, ఫారాలు సకాలంలో అందకపోవడంతో విసుగు చెందిన ఓటర్లు ఆన్లైన్ బాట పట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు భువనగిరి నియోకవర్గంలో 1,182మంది, ఆలేరులో 990 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సబ్మిట్ చేశారు.
