ఖానాపూర్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విమర్శించారు. ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ కు చెందిన పాత తర్లపాడ్ సర్పంచ్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సాయిరాంతోపాటు పలువురు బుధవారం బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేలా ప్రజా ప్రతినిధులు చూడాలన్నారు. అంతకు ముందు తర్లపాడ్ లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజురా సత్యం, నిమ్మల రమేశ్, జమాల్ ఖురేషి, గొర్రె గంగాధర్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, నాయకులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చలు
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బొజ్జు పటేల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ ఆఫీసులో చైర్ పర్సన్ అంకం మౌనిక అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సర్వసభ్య ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చైర్ పర్సన్, సభ్యులతో చర్చించారు.
పట్టణంలో కోతుల బెడద తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షోయబ్ హుస్సేన్, కమిషనర్ సుందర్ సింగ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంతకుముందు అంగడి బజార్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

