హైదరాబాద్ సిటీ, వెలుగు: ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ఇండియా (AI-2879) ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆ విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు. ఫ్లైట్‌ను మిగతా విమానాలకు దూరంగా ఐసోలేషన్ బేలో ఆపి.. ఫైర్ ఇంజన్లు, బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్, పోలీసు బృందాలతో సోదాలు చేశారు.
ల్యాండ్ అయిన అరగంట తర్వాత కూడా ప్రయాణికులను కిందికి దిగనివ్వలేదు. తమ దగ్గరున్న లగేజీనంతా ఎయిర్‌పోర్టు సిబ్బందికి అప్పగించిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని ఫ్లైట్‌లో ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపారు. ఫ్లైట్ సహా ప్రయాణికులు, వారి దగ్గరున్న లగేజీ, కార్గోలను బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. చివరకు బాంబు లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫ్లైట్‌లో ఎంపీ ఆర్.కృష్ణయ్య, జస్టిస్ నరసింహారెడ్డి తదితరులు ఉన్నట్టు సమాచారం.
