 
                                    చెన్నై: తమిళనాడులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. చెన్నైలోని శాస్త్రి భవన్లో ఉన్న ఈడీ ఆఫీసును ఆర్డీఎక్స్ బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని నెంబర్ నుంచి అధికారులకు ఈ మొయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ ఈడీ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. చివరికి ఎలాంటి బాంబ్ లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో హోక్స్ మెయిల్గా తేలింది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈడీ కార్యాలయం దగ్గర హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.
మరోవైపు.. మెయిల్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. తమిళనాడు మంత్రి కెఎన్ నెహ్రూ విషయంలో ఈడీ కార్యాలయానికి ఈ బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీస్ వర్గాలు గుర్తించాయి. మెయిల్ పంపిన వ్యక్తి ఎంపీఎల్ రావు, సీపీఐ-మావోలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. బాంబ్ బెదిరింపు నేపథ్యంలో శాస్త్రి భవన్, ఈడీ కార్యాలయం చుట్టూ భద్రతను భారీగా పెంచారు పోలీసులు. సైబర్ క్రైమ్ విభాగం ఈమెయిల్ మూలాన్ని గుర్తించడం ప్రారంభించిందని తెలిపారు.
మనీలాండరింగ్ ఆరోపణల మేరకు ఇటీవల మంత్రి కేఎన్ నెహ్రూ కుటుంబానికి సంబంధించిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మంత్రి నెహ్రుతో సంబంధం ఉన్న ఒక కంపెనీపై మనీలాండరింగ్ ఆరోపణల కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు సమయంలో తమిళనాడులో జరిగిన జాబ్ ఫర్ మనీ కుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఏజెన్సీ బట్టబయలు చేసింది. అనంతరం ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని తమిళనాడు పోలీసులను ఈడీ కోరింది. ఈ మేరకు 232 పేజీల నివేదికను పోలీసులకు ఈడీ పంపింది. ఈ క్రమంలో చెన్నై ఈడీ కార్యాలయానికి బాంబ్ బెదిరింపు రావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. 
 

 
         
                     
                     
                    