హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు.. పేల్చేస్తామంటూ ఈమెయిల్ 

హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు.. పేల్చేస్తామంటూ ఈమెయిల్ 

హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం ( ఫిబ్రవరి 20 ) బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపారు ఆగంతకులు. ఈ క్రమంలో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. రెండు రోజుల క్రితం కూడా సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. బెదిరింపు ఈమెయిల్ పంపిన ఆగంతకులను ట్రేస్ చేందుకు సన్నాహాలు చేస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. బుధవారం కూడా ఇదే తరహాలో సీబీఐ కోర్టుకు, కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం 9.05 గంటలకు నాంపల్లిలో సీబీఐ కోర్టు సూపరింటెండెంట్, కరీంనగర్ లోని జిల్లా జడ్జీకి మెయిల్స్ వచ్చాయి. కోర్టులో12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయని మెయిల్లో పేర్కొన్నారు. కానిస్టేబుల్స్ తో పాటు కోర్టు సిబ్బందిని వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అందుకే ఇలా చేస్తున్నామని తెలిపారు. బాంబులు పేలకపోతే కోర్టు ప్రాంగణంలోకి చొరబడి ఆత్మహుతికి పాల్పడతామన్నారు.

మెయిల్స్ చదివిన కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి కోర్టులోంచి జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు.బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు బాంబు బెదిరింపులు రావడంతో సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఈ బెదిరింపుల వెనక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా లేక ఆకతాయిల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.