పెద్దపల్లి, వెలుగు: బోనాల పండుగ సమాజ ఐక్యతకు నిదర్శనమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలకు ఎంపీ హాజరయ్యారు. ఈ వేడుకల్లో గౌడ కులస్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు.
కార్యక్రమంలో నాయకులు కాడే సూర్యనారాయణ, ఉనుకొండ శ్రీధర్పటేల్, భూమయ్య, సతీశ్, గ్రామ పెద్దలు, గౌడ సంఘం ప్రతినిధులు ఉన్నారు. అనంతరం గోదావరిఖని సీతానగర్‌లోని కాకా వెంకటస్వామి అభిమాని మంథని నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం సర్పంచ్ మేడ రాజయ్య గృహ ప్రవేశానికి హాజరయ్యారు. రాజయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను శాలువాతో సన్మానించారు.
