- ఇప్పటికే మద్దతు ధర చెల్లింపు
- ఉమ్మడి జిల్లా రైతులకు తాజాగా బోనస్
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: సన్న వడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బోనస్ జమ చేస్తోంది. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తోడుగా బోనస్ చెల్లిస్తామని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీకి తగ్గట్టుగానే 2024 వానాకాలం సీజన్లో సన్న వడ్లు అమ్మిన రైతులకు బోనస్ అందించింది. ఈ వానాకాలం సీజన్లో లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
వడ్ల కొనుగోలు ఈ నెలాఖరుకు ముగిసిపోనుంది. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన వడ్లకు వెంటవెంటనే మద్దతు ధరను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. యాదాద్రి జిల్లాలో 3 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. ఇందుకు గాను మద్దతు ధర ప్రకారం రూ. 714.85 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకూ రూ. 677.02 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసింది.
తాజాగా బోనస్ రూ. 108.91 కోట్లు
పండించే 33 రకాల్లో గింజ పొడవు, నాణ్యతను బట్టి బోనస్ చెల్లింపు ఉంటుంది. కొనుగోలు సెంటర్లలో అమ్మిన రైతులకు ఈ బోనస్ వర్తిస్తుంది. ఈ విధంగా యాదాద్రిలో 8,748 టన్నుల సన్నొడ్లకు రూ. 3.44 కోట్లు బోనస్ అందనుంది. నల్గొండ జిల్లాలో కొనుగోలు చేసిన 82 వేల టన్నులకు రూ. 41.06 కోట్లు అందనుంది. సూర్యాపేట జిల్లాలో 1.28 లక్షల సన్నొడ్లకు రూ. 64.84 కోట్లు బోనస్ అందనుంది. సూర్యాపేట జిల్లాలో రూ. 39.06 కోట్లు, నల్గొండ జిల్లాలో రూ. 17. 41 కోట్లు, యాదాద్రిలో రూ. 1.24 కోట్లు మొత్తం రూ. 60 కోట్లను రైతుల కు చెల్లించింది.
బోనస్ చెల్లింపుతో..
పంట పెట్టుబడి భారీగా పెరిగిన పరిస్థితుల్లో క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడం రైతులకు ఊతంగా మారనుంది. సన్న వడ్లకు బోనస్ ఇస్తుండడంతో ఇప్పటికే సన్న రకాల సాగు కొంత పెరిగింది. రానున్న సీజన్లలో దొడ్డు రకాలు పండించే రైతులు కూడా సన్న రకాల సాగు వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమౌంట్ అకౌంట్లలో జమకాని రైతులు పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లోని 'ఫార్మర్ కార్నర్'లో ఫిర్యాదు చేయవచ్చు.
జిల్లా వారీగా బోనస్ వివరాలు
జిల్లా వచ్చే బోనస్(కోట్లు) చెల్లింపు(కోట్లు)
సూర్యాపేట రూ. 64.40 రూ. 39.06
నల్గొండ రూ. 41.06 రూ. 17.41
యాదాద్రి రూ. 3.44 రూ. 1.24
