హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ వ్యవస్థలపై విపక్షాల అక్కసు సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. శనివారం నాంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలిస్తే సంబరాలు చేసుకుని, ఓడిపోతే ఈవీఎంలు, ఈసీపై నిందలు వేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. యూపీ, బిహార్, పంజాబ్, గోవాలో పరాభవం తప్పదనే భయంతోనే కాంగ్రెస్ ముందే సాకులు వెతుక్కుంటోందన్నారు.
ఈసీ, ఈవీఎంలపై నమ్మకం లేకపోతే.. అవే ఈవీఎంల ద్వారా గెలిచి ప్రభుత్వాలను నడుపుతున్న తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ హయాంలోనే బీజేపీ సీట్లు తగ్గగా, కాంగ్రెస్ బలం పెరిగిందని.. ఈ లెక్కన ఆ పార్టీ నేతలు సీఈసీని నెత్తిన పెట్టుకోవాలని చురకలంటించారు.
