జై శ్రీరాం : ముస్లిం బిడ్డకు రాముడి పేరు.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పుట్టాడని..

  జై శ్రీరాం : ముస్లిం బిడ్డకు రాముడి పేరు.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పుట్టాడని..

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజీత్ ముహూర్తంలో గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠాపన శుభ కార్యం జరిగింది. ఈ ముహూర్తం మంచిదని భావించి చాలామంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను మొదలుపెట్టారు. ఇక గర్భిణులు అయితే అదే దివ్య ముహుర్తంగా భావించి  పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు.  ఇందులో కొందరికి  నార్మల్ డెలివరీలు కాగా.. మరికొందరు  సిజేరియన్ ఆపరేషన్లు చేయంచుకుని బిడ్డలకు జన్మనిచ్చారు.  

ఉత్తరప్రదేశ్ లోని  ఫిరోజాబాద్‌లోని ఫర్జానా అనే ముస్లిం మహిళ  మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పుట్టిన బిడ్డకు  రామ్ రహీమ్ అని నామకరణం చేసింది.. హిందూ-ముస్లింల ఐక్యత సందేశం ఇచ్చేందుకే బిడ్డకు రామ్ రహీమ్ అని పేరు పెట్టినట్లు చెప్పింది.  బిడ్డ, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.  ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ గణేశ్‌ శంకర్‌ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మందికి కాన్పులు జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. 25 మంది శిశువులలో, 10 మంది బాలికలు కాగా, మిగిలిన వారంతా అబ్బాయిలే..  అందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లులు తమ బిడ్డకు రాముడి పేరు కలిసి వచ్చేలా..   రాఘవ్, రాఘవేంద్ర, రఘు వంటి పేర్లు పెట్టారు. అమ్మాయిలకు జానకి, సీత అని పేర్లు పెట్టారు.

సంభాల్ జిల్లాలో చందౌసిలో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లోని డెలివరీ రూమ్ లోపల చిన్న రామాలయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం గర్భిణులకు ప్రసవానికి ముందు శ్రీరాముడి దర్శనం కల్పించారు. సోమవారం ఆసుపత్రిలో ముగ్గురు మగపిల్లలు సహా మొత్తం ఆరుగురు పిల్లలు జన్మించారని డాక్టర్ సక్సేనా తెలిపారు. అప్పుడే పుట్టిన అబ్బాయిలకు తల్లిదండ్రులు రాముడి పేరు పెట్టారు.