కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ మాయ మాటలు : మంత్రి హరీశ్ రావు

కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ మాయ మాటలు  : మంత్రి హరీశ్ రావు

నిన్నటి సభ కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటి చెప్పిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంచనాలకు మించి స్వచ్ఛందంగా మునుగోడుకు వచ్చిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి సభతో టీఆర్ఎస్ కు ముమ్మాటికీ గెలుపు ఖాయమైపోయిందని స్పష్టం చేశారు. ఈ సభతో ప్రతి ఒక్కరిలోనూ స్పష్టత వచ్చిందని చెప్పారు. దశాబ్దాల నాటి ఫోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత టీఆర్ఎస్ ది, కేసీఆర్ దేనన్న ఆయన... నిన్నటి సభతో బీజేపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా అయిపోయిందని కామెంట్ చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రస్టేషన్ తో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరని ఆరోపించారు. వాళ్లిద్దరి మాటలు నకిలీ, మకిలీ మాటలని, వెకిలి చేష్టలని విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ మాయ మాటలని, అంతులేని అబద్దాలని ఆరోపించారు.

బీజేపీ దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది

అబద్దాలాడడమనేది బీజేపీ డీఎన్ఏగా మారిపోయిందని హరీశ్ రావు చెప్పారు. తమ స్థాయిని మరిచి, పదవిని మరచి పిచ్చి పిచ్చి ప్రేలారేపణలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం సభ తర్వాత వాళ్లకు దిమ్మతిరిగిపోయిందన్న ఆయన.. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నపుడు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కానీ వాళ్లు మాటలు గల్లీ రాజకీయ నాయకులకు దిగజారిపోయి మాట్లాడినట్టున్నాయని చెప్పారు. బీజేపీ దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. వాళ్ల మాటలు వింటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలా ఉన్నాయని చెప్పారు. 8ఏండ్లళ్ల ఏం చేయలేదని .. 15 రోజులలో ఏం చేస్తారట అని తమని ప్రశ్నించిరు గానీ.. అసలు తాము ఏం చేయలేదో మునుగోడు పోయి అడుగుదామని అన్నారు. తమ ప్రభుత్వంతో 99శాతం మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ ఫలం దొరికిందని చెప్పారు. ఏ ఇంటికి పోయినా ఏ అక్కనడిగినా, ఏ చెల్లెనడిగినా.. శుద్ధిచేసిన జలాల గురించి చెప్తరని స్పష్టం చేశారు.

 

 

మునుగోడులో ప్రతి ఇంటికీ టీఆర్ఎస్ వల్ల లబ్ధి కలిగింది

అప్పుడెట్ల ఉండే.. తాము వచ్చాక ఎలా ఉంది.. వాళ్లనడిగితే వాళ్లే చెప్తరని హరీశ్ రావు అన్నారు. తాము చెప్పేది నిజమైతే తమకే ఓటెస్తరని, రాజగోపాల్ చెప్పింది నిజమైతే వాళ్లకే ఓటెస్తరని చెప్పారు. తాము చెప్పింది నిజమైతే బండి సంజయ్ కు కర్రు కాల్చి బీజేపీ పార్టీకి వాత పెట్టాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ప్రతి ఇంటికీ టీఆర్ఎస్ వల్ల లబ్ధి కలిగిందన్న హరీశ్ రావు.. మీరేమో ధరలు పెంచితే.. మేమేమో పథకాల ద్వారా పంచుతూ వస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టిందన్నారు. ప్రజలకు తెల్సు ఎవరు భారం పెంచిన్రో.. ఎవరు అన్నం పెట్టిన్రో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మునుగోడులోనే దళిత బంధు ద్వారా రూ.131.80లక్షలు అందించినమన్న ఆయన.. మునుహోడులో 40వేల పైచిలుకు ఆసరా పెన్షన్ లు ఇస్తున్నమని తెలిపారు.

పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడడమా...?

తమ ఎమ్మెల్యేలు వందల కోట్ల ఆశ చూపినా కేసీఆర్ చెప్పినట్టు గడ్డిపోచలాగా వాటిని వదులుకొని రాష్ట్ర కోసం పాటు పడుతున్నరని హరీశ్ రావు అన్నారు. పార్టీలోచేరికల గురించి బీజేపీ మాట్లాడడమా... అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని సెటైర్ వేశారు. మీలాగా దొడ్డిదారిన ప్రభుత్వాలు కూలగొట్టలేదన్న ఆయన.. ఈడీలనో ఇంకావేరే దాన్నో చూపించి ప్రలోభాలకు గురిచేస్తరని ఆరోపించారు. భయపెట్టించి పార్టీలో చేరేటట్టు చేస్తరని, ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తరని విమర్శించారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటిమోహనరావు, టీజీ వెంకటేశ్ లను పార్టీలో మీరు విలీనం చేసుకోవడం కరెక్టయితే.. కాంగ్రెస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరితే ఎలా తప్పైతదని నిలదీశారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలను కూల్చి.. దొడ్డి దారిన గద్దెనెక్కిన్రి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు. అలాంటి మీరు రాజకీయాల గురించి, ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించి మాట్లాడతరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అబద్ధాలు చెప్పినందుకు నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

మోటర్లకు మీటర్లకు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని మీరు చూశారని హరీశ్ రావు ఆరోపించారు. కానీ తాము రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడాలనుకున్నం గనకనే రూ.30వేల కోట్లను కూడా వదులుకొని రైతుల పక్షాన టీఆర్ఎస్ నిలబడ్డదని స్పష్టం చేశారు. కచ్చితంగా బీజేపీకి రైతులు కర్రు కాల్చి వాత పెడ్తరని వ్యాఖ్యానించారు. ఇది ఒక్క మునుగోడులోనే కాదు  రాష్ట్రంలోని రైతులందరికీ తెలియాల్సిన విషయమన్నారు. తాము జీఎస్టీ ఒప్పుకొని ఆర్థిక మంత్రి సంతకం పెట్టారని అబద్దం చెబుతున్నారన్న హరీశ్ రావు.. 2017 లో జీఎస్టీ వచ్చినప్పుడు మీ పక్కన వున్న ఈటెల రాజేంద్రనే ఆర్థిక మంత్రని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పినందుకు బేషరతుగా నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ నిర్మూలన కోసం కేంద్రం 800 కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి చెప్పటం హాస్యాస్పదమన్నారు.

కిషన్ రెడ్డి.. మీ బాధ్యతను మర్చిపోతున్నరు

ఓట్ల కోసం ఇంత దిగజారుతారా అన్న హరీశ్ రావు... ఓట్ల కోసం ఇట్లా మాట్లాడితే ప్రజలు బఫూన్లు అనుకోరా అని ప్రశ్నించారు. రాష్ట్ర పథకాలను కాపీ కొట్టి అమలుచేస్తున్నరని, కిషన్ రెడ్డి.. మీ బాధ్యతను మర్చిపోతున్నరని చెప్పారు. నిజంగా మీకు ఈ రాష్ట్రం మీద ప్రేముంటే మిషన్ భగీరథకు కేంద్రం ప్రభుత్వం నుండి హర్ ఘర్ కోలో భాగంగా రూ.18వేల కోట్లు ఇప్పించండని, నీతి ఆయోగ్ చెప్పినట్టు రూ.19200కోట్లు ఇప్పించండని డిమాండ్ చేశారు. 15వఆర్థిక సంఘం చెప్పినట్టు రూ.2350 కోట్లు ఇప్పించి మాట్లాడండని సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ప్రతినిధిగా ఈ రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాలను కేంద్రం నుంచి రప్పించి మాట్లాడండంటూ మండిపడ్డారు.

నిజమే నిలుస్తది... ధర్మమే గెలుస్తది

నిన్నటి సభ చూశాక వాళ్ల మైండ్ దిమ్మతిరిగిపోయిందని, అందుకే అన్నీ అబద్దాలు చెప్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. బీజేపీ అంటే బోరు బావిలకు మీటర్లు, రైతుల మెడకు ఉరితాళ్లు.. కూలిపోయే బ్రిడ్జీలు.. ప్రజల జీవితాలు నీళ్లపాలు అన్న హరీశ్ రావు.. టీఆర్ఎస్ అంటే  రైతు బంధుతో రైతుకు ధీమా.. నీళ్లతో తీర్చిన కన్నీళ్లు.. కరెంటుతో తొలగిన కష్టాలని చెప్పారు. సంక్షేమం టీఆర్ఎస్ వైపు... సంక్షోభం బీజేపీ వైపు అని కామెంట్ చేశారు. ఈ విషయం ఇప్పటికే మునుగోడు ప్రజలకు అర్థమైందన్న ఆయన.. తామేమో కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే పనులు చేస్తుంటే .. బీజేపీ వాళ్లేమో అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నరని ఆరోపించారు. ఏదేమైనా నిజమే నిలుస్తదని, ధర్మమే గెలుస్తదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో తమకు సంబంధమే లేకపోతే బీజేపీ ఎందుకు కేసు వేసిందని ప్రశ్నించారు. అంటే పరోక్షంగాఒప్పుకున్నట్టే కదా అని నిలదీశారు.