
కూసుమంచి, వెలుగు : రోటోవేటర్‌లో పడి ఆరేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లోక్యాతండా శివారు కొత్తతండాకు చెందిన వడ్త్యి రాంబాబు, దీపిక దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఆదివారం దుక్కి దున్నేందుకు రాంబాబు తన కొడుకు భువనేశ్వర్ (6)తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు.
ట్రాక్టర్‌కు రోటోవేటర్‌ను తగిలించి, ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న చెక్కపై భువనేశ్వర్‌ను కూర్చోబెట్టాడు. దుక్కి దున్నుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భువనేశ్వర్ రోటోవేటర్‌లో పడి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బావిలో పడి..
హుజూరాబాద్ (సైదాపూర్) వెలుగు: పొలం వద్ద ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన చిరాల వెంకటయ్య, కావ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆదివారం కొడుకు కౌశిక్ నంద (18 నెలలు)ను తీసుకొని పొలం వద్దకు వెళ్లిన కావ్య.. బాలుడిని గట్టు వద్ద వదిలి పొలంలోకి దిగింది. గట్టుపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. గమనించిన కావ్య గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి వచ్చిన స్థానికులు బాలుడిని బయటకు తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని నీటిని బయటకు తోడుతున్నారు. అయినా బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.