
- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
తూప్రాన్, వెలుగు: పెళ్లి చేసేందుకు వచ్చిన పంతులు పుస్తెల తాడు కొట్టేసిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కొడుకు జ్ఞానేందర్దాసుకు నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న పడాలపల్లిలో పెళ్లి జరిగింది. పెళ్లి గజ్వేల్ కు చెందిన పురోహితుడు జరిపించారు. ఆ సమయంలో అమ్మాయి మెడలో వేయాల్సిన మూడు తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించాడు. వివాహం అనంతరం అమ్మాయి మెడలో పుస్తెలతాడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. పెళ్లిలో తీసిన వీడియోలో పరిశీలించగా పంతులు తీసినట్లు కనిపించింది. దీంతో బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ ఎస్సై సత్యనారాయణ చెప్పారు.