సాధ్యమయ్యే ప్రామిస్​లనే చేయాలి

సాధ్యమయ్యే ప్రామిస్​లనే చేయాలి

ఇష్టం, ప్రేమతోనే ఏ రిలేషన్​షిప్​ అయినా మొదలవుతుంది. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే.... ఏ అనుబంధానికి అయినా నమ్మకమే పునాది. అయితే ఇద్దరిలో ఒకరు మాట నిలబెట్టుకోకపోవడం, అబద్ధాలు చెప్పడం వల్ల ఆ నమ్మకం బ్రేక్​ అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య ఉన్నప్రేమ, చనువు తగ్గిపోతాయి. అందుకని నమ్మకాన్ని బ్రేక్​ చేసే విషయాలు ఏంటో తెలుసుకోవాలి. దాంతో అలాంటి పొరపాట్ల కారణంగా అనుబంధాల మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తపడొచ్చు అంటోంది సైకోథెరపిస్ట్ ఎమిలీ సాండర్స్​​. 

‘ఈసారి ఇంటర్వ్యూ మిస్​ కాను’, ‘చెడు అలవాట్లు మానేస్తాను’... ఇలా చాలా ప్రామిస్​లు​ చేస్తారు కొందరు. కానీ, అవేమీ నిలబెట్టుకోరు. దాంతో అవతలివాళ్ల మనసు నొచ్చుకుంటుంది. మరికొందరేమో గొప్పలకు పోయి సాధ్యమవుతాయా? కావా? అనేది కూడా ఆలోచించకుండా పెద్ద ప్రామిస్​లు చేస్తారు. పదే పదే ఇలానే జరుగుతుంటే అవతలివాళ్లకు నమ్మకం పోతుంది. అందుకని మాట ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సాధ్యమయ్యే ప్రామిస్​లనే చేయాలి. 
 
ఇద్దరూ ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకోవడం, జోక్స్ వేస్తూ నవ్వుకోవడం మంచిదే. అయితే ఆ జోక్స్​ వెటకారంగా ఉండొద్దు. ఏదైనా జోక్​ అవతలి వాళ్లకు నచ్చకుంటే అంతటితో ఆపేయాలి. అంతేకాదు ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడొద్దు. అలాచేస్తే రిలేషన్​షిప్ దెబ్బ తింటుంది. 

చాలా సందర్భాల్లో ‘చిన్న విషయయే కదా!’ అని అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది. ఒకసారి అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే అది అలవాటుగా మారుతుంది. దాంతో తమను మోసం చేస్తున్నారని అవతలివాళ్లు అనుకుంటారు. ఇకపై ఏం చెప్పినా నమ్మరు. అందుకని ఎప్పుడూ నిజమే చెప్పాలి.  

పార్ట్​నర్​కి ఏం అవసరమో, వాళ్ల ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్లు  ‘ఫలానావి కావాలి’ అని అడిగినప్పుడు  వెంటనే కాకపోయినా తర్వాత అయినా కొనివ్వాలి. అలాకాకుండా వాళ్లు ఏం అడిగినా ‘ఎందుకు? వద్దు’ అని అంటే తమ ఇష్టాల్ని గుర్తించడం లేదని  అనుకుంటారు అవతలివాళ్లు. దాంతో ఇద్దరి మధ్య అనుబంధం బలహీనపడుతుంది. 

ఇద్దరి మధ్య సీక్రెట్స్​ ఉండొద్దు.  ముఖ్యంగా డబ్బుల విషయం ఇద్దరికీ తెలియాలి. డబ్బులు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఏమేం కొంటున్నారు? అనేది ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. దాంతో ‘నువ్వు అనవసరంగా ఖర్చు చేస్తున్నావు?’ ‘నాకు తెలియకుండా డబ్బు ఖర్చు చేస్తున్నావు?’ అంటూ గొడవపడకుండా ఉంటారు.