- అమెరికా, ఇరాన్ మధ్య డీల్ కుదిరే అవకాశం..
- 90 డాలర్లకు పడిన బ్రెంట్ క్రూడాయిల్
- భవిష్యత్‌లో ధరలు మరింతగా పడే అవకాశం
- ధరలు తగ్గితే ఇండియాకు మేలు
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా క్రూడాయిల్ ధరలు ఏడు వారాల కనిష్టానికి పడిపోయాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాంతి ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉండడంతో కిందటి వారం 11 శాతం మేర పతనమయ్యాయి. శాంతి ఒప్పందం కుదిరితే హార్మూజ్ జల సంధి తిరిగి ఓపెన్ అవుతుంది. దీంతో క్రూడాయిల్ సప్లయ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
1) 90 డాలర్లకు బ్రెంట్ ధర
బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర గడిచిన వారంలో దాదాపు 11 శాతం మేర క్షీణించి బ్యారెల్‌కు 90 డాలర్లకు పడిపోయింది. గత ఏడు వారాల్లో బ్రెంట్‌కు ఇదే అతిపెద్ద వీక్లీ లాస్. మే 29 (శుక్రవారం) నాటి ముగింపు సెషన్‌లో జులై బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.8 శాతం తగ్గి 92.05 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా క్రూడ్ డబ్ల్యూటీఐ ఈ వారంలో 9శాతం కంటే ఎక్కువ పడిపోయింది.
గత ఆరు వారాల్లో దీనికి ఇదే అతిపెద్ద వీక్లి లాస్. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఇది బ్యారెల్‌కు1.7 శాతం నష్టపోయి 87.36 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఈ రెండు రకాల ముడి చమురు బెంచ్‌మార్క్‌లు కూడా ఏప్రిల్‌లోని కనిష్టాలను మళ్లీ తాకాయి. ఇండియన్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు 97.52 కి దిగొచ్చింది. అంతకుముందు వారంలో ఆయిల్ ధరలు 110 డాలర్ల దగ్గర కదిలాయి. క్రూడ్ ధరలు తగ్గితే ఇండియాకు మేలు జరుగుతుంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో పాటు రూపాయి పతనం ఆగుతుంది.
2) పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఒకవైపు శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా, గురువారం రాత్రి ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా జరిపిన తాజా దాడులతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికి ప్రతిచర్యగా, అమెరికా వైమానిక స్థావరంపై తాము దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఉద్రిక్తతలు పెరిగితే మళ్లీ ఆయిల్ ధరలు పెరగొచ్చు.
- ఫ్యూచర్‌లో ఎలా?
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, హార్మూజ్ జల సంధి ఓపెన్ కావడానికి, రవాణా సాధారణ స్థాయికి చేరడానికి కనీసం కొన్ని నెలల టైమ్ పడుతుంది. మిడిల్ ఈస్ట్‌లో గ్యాస్, ఆయిల్ ప్లాంట్లు దెబ్బతిని ఉంటే , అవి తిరిగి సాధారణ స్థాయికి రావడానికి ఇంకా ఎక్కువ కాలం పట్టొచ్చు. ఆయిల్ సప్లయ్ పెరగడానికి ఎంతెక్కువ టైమ్ పడితే అంతెక్కువ కాలం ధరలు గరిష్టాల్లో కొనసాగుతాయి. హార్మూజ్‌లో అంతరాయాలు ఇలాగే కొనసాగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరపడటానికి 2027 వరకు సమయం పడుతుందని సౌదీ అరామ్‌కో సీఈఓ అమీన్ నాసర్ హెచ్చరించారు.
దీనివల్ల వారానికి దాదాపు 100 మిలియన్ బారెళ్ల చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని అంచనా వేశారు. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రస్తుత చమురు మార్కెట్‌ను "కాలంతో పరుగు పందెం" గా అభివర్ణించింది. అమెరికా నుంచి ముడి చమురు ఎగుమతులు పెరగడం, చైనా నుంచి డిమాండ్ తగ్గడం వంటి అంశాలు ఇప్పటివరకు సరఫరా కొరత భారాన్ని కొంతవరకు తగ్గించగలిగాయని తెలిపింది. అయితే, ఒకవేళ ఈ జలసంధి జూన్ అంతటా మూతపడి ఉంటే, ధరలు మళ్లీ పెరుగుతాయని, అంతర్జాతీయంగా చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
