కింద ఉన్న జాతీయ జెండాను స్వయంగా తీసి జేబులో పెట్టుకున్న మోదీ

కింద ఉన్న జాతీయ జెండాను స్వయంగా తీసి జేబులో పెట్టుకున్న మోదీ

బ్రిక్స్ సదస్సులో గ్రూప్ ఫోటో సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. నేలపై పడ్డ భారత త్రివర్ణ పతాకాన్ని గుర్తించి, జాగ్రత్తగా తీసి జేబులో పెట్టుకున్నారు. మోదీని గమనించిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తమ దేశ జెండాను తీసి అక్కడున్న సిబ్బందిని పిలిచి వారికిచ్చేశారు. కానీ మోదీ మాత్రం జాతీయ జెండాను అలాగే తన జేబులో పెట్టుకుంటానని చెప్పడం అతని నాయకత్వ నిలకడకు, దేశంపై, జాతీయ జెండాపై గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 22న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. అంతకుముందు జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ అని అన్నారు. త్వరలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని మోదీ చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్‌గా అవతరించనుందని ఈ సందర్భంగా ప్రధాని ఉద్ఘాటించారు.