
బషీర్ బాగ్,- వెలుగు: బీసీల్లోని 26 కులాలను రాష్ట్ర బీసీ జాబితా నుంచి తొలగించిన బీఆర్‌ఎస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రంలో తొలగింపునకు గురైన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తొలగించిన వెనుకబడిన 26 కులాలను 8 రోజుల్లోపే బీసీ జాబితాలో కలపాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. డిసెంబర్ 13, 14 న జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ 5 వేల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్లు కృష్ణయ్య ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్రోహి కేసీఆర్‌ను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్, సుధాకర్, రాజేందర్, అనంతయ్య, పితాని ప్రసాద్ , బిల్ల దీపిక తదితరులు పాల్గొన్నారు.