మహిళల ఉపాధిపై కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దెబ్బకొట్టిందన్నారు మాజీ ఎంపీ, ఐద్వా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి బృందాకారత్. ఆదివారం (జనవరి 25) హైదరాబాద్ బస్ భవన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 14వ ఐద్వా జాతీయ మహాసభల్లో పాల్గొన్న ఆమె.. మోదీ ప్రభుత్వం ఉపాధిహామీ నీరు గార్చిందని విమర్శించారు. మన్రేగా ను తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 100 రోజుల ఉపాధి పథకాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగులో స్పీచ్ ప్రారంభించిన బృందాకారత్ తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ అని.. అలాంటి తెలంగాణ గడ్డ మీద ఆల్ ఇండియా కాన్ఫరెన్ నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నామని చెప్పిన ఆమె.. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం, మత సామరస్యంపై కేంద్రం బుల్డోజ్ చేస్తోందని విమర్శించారు.
మోడీ గణతంత్ర దినోత్సవం లో సెల్యూట్ తీసుకుని.. ఆరెస్సెస్ కోసం పనిచేస్తాడని విమర్శించారు. మతం ఏదైనా మా రక్తం ఎర్రగా ఉంటుందన్నారు. మహిళల శ్రమ దోపిడీకి గురవుతోందన్నారు. RSS, BJP లు హిందూ మహిళలను ముందు పెట్టీ వారి మతతత్వాన్ని వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు.
బీజేపీ వందేళ్లు అధికారంలో ఉంటే మహిళలు వంటింటికే..
బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఇంకో వందేళ్లు ఉంటే మహిళలు మళ్ళీ వంటింటికి పరిమితం అవుతారని అన్నారు. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు PK శ్రీమతి. ఎందుకంటే వాళ్ళు మనుస్మృతిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఐద్వా సభలను ప్రారంభించిన ఆమె.. జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ దేశంలో నిరక్షరాస్యత రాజ్యమేలుతోందన్నారు. కేరళలో జీరో పేదరికం రావడానికి అక్కడి ప్రభుత్వ విధానాలు అని తెలిపారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని.. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా నేటి మహిళ పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
అదానీ, అంబానీలకు ప్రభుత్వం మోకరిల్లింది..
అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం మోకరిల్లిందన్నారు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు.
పెద్ద పెద్ద దోపిడీ దారులకు ప్రభుత్వాలు మద్ధతిస్తున్నాయని అన్నారు. దేశంలో మైక్రో ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న మోసాలకు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఈ మోసాలలో పెద్ద పెద్ద దోపిడీదారులు భాగస్వాములుగా ఉంటున్నారని అన్నారు. వారికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ పోరాటాల గడ్డ.. అనేక పోరాట యోధులు పుట్టిన నేలలో ఈ మహాసభ జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్లకు బెయిల్ దొరుకటం విడ్డూరం అని అన్నారు. ఇలాంటివి కొనసాగుతుంటే ఐద్వా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
