- విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: దాదాపు 200 ఏళ్ల పాటు భారత్ ను బానిస సంకెళ్లతో బందీ చేశాయి పాశ్చాత్య దేశాలు. ముఖ్యంగా వ్యాపారం చేసుకుంటామంటూ వలస వచ్చిన బ్రిటిషర్లు.. మనపై పెత్తనం చేశారు. మన పౌరులను అణగదొక్కారు. హింస పెట్టారు. మన సంపదనంతా దోచుకెళ్లారు.
ఈ విషయాలన్నీ కొత్తవి కాదు. కానీ ఈ మాటలు స్వయంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ నోటి నుంచి రావడం విశేషం. అది కూడా ఓ అంతర్జాతీయ వేదికపై ఈ వ్యాఖ్యలు చేశారాయన. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన అట్లాంటిక్ కౌన్సిల్ లో ఆయన మాట్లాడారు. కేవలం వలస పాలనలో భారతీయులను అణగదొక్కిన విషయమే కాదు.. బ్రిటిషర్లు చేసిన దోపిడీ ఎంతో కూడా చెప్పారు.
ఎకనమిక్ సర్వే తేల్చిన మొత్తమిది!
భారత్ ను పాశ్చాత్య దేశాలు 200 ఏళ్ల పాటు దోచుకున్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. 18వ శతాబ్దం మధ్యలో వచ్చిన బ్రిటిషర్లు భారత్ లో చాలా అకృత్యాలు చేశారన్నారు. ‘భారత్ నుంచి బ్రిటిష్ దోచుకుని వెళ్లిన సంసదను అంచనా వేసేందుకు ఓ ఎకనమిక్ సర్వే ప్రయత్నం చేసింది. ఒక్క బ్రిటిష్ మాత్రమే భారత్ నుంచి దోచుకున్న సంపద రూ.3200 లక్షల కోట్లు ఉంటుందని తేల్చింది. నేటి విలువ ప్రకారం ఈ మొత్తాన్ని అంచనా వేసింది’ అని చెప్పారు జై శంకర్.


