
- ఎక్కువ పరిహారం ఇప్పిస్తామంటూ నిర్వాసితులతో ఒప్పందం
- ముందుగా భూములు కొన్నట్లు అగ్రిమెంట్లు.. తర్వాత కోర్టుల్లో కేసులు
- ఆర్బిట్రేషన్ ద్వారా పెరిగిన మొత్తంలో 30 శాతం కమీషన్
- సహకరిస్తున్న రెవెన్యూ, భూ సేకరణ విభాగం ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు : వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణలో నష్టపరిహారం ఇప్పించే విషయంలో బ్రోకర్లు ఎంటర్ అవుతున్నారు. ప్రభుత్వం ముందుగా ఇచ్చిన పరిహారం సరిపోదంటూ నిర్వాసితులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడంతో దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పై స్థాయిలో పైరవీలు చేసి ఎక్కువ మొత్తంలో పరిహారం ఇప్పిస్తామంటూ చెప్పి ‘కమీషన్’ రూపంలో తమ జేబులు నింపుకుంటున్నారు. ఎక్కడైనా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని తెలియగానే ఆ ప్రాంతంలోని కొందరు భూములు కొంటుండగా.. మరికొందరు భూములు కొన్నట్టు ల్యాండ్ ఓనర్లతో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. తర్వాత పరిహారం పెంపు కోసం పైరవీలు మొదలు పెడుతున్నారు. వీరికి రెవెన్యూ, భూ సేకరణ విభాగం ఆఫీసర్లు సైతం సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమాయకులే టార్గెట్‌గా...
ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ కోసం సేకరించే భూములకు అప్పటి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుంది. సాధారణంగా ఈ మొత్తం మార్కెట్ రేటు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సరిపోదని అనుకునే వారు ముందుగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆ తర్వాత కోర్టులను ఆశ్రయించడంగానీ, ఆర్బిట్రేషన్ కోసం కలెక్టర్‌కు అప్లై చేసుకోవడం గానీ జరుగుతుంది. ఈ ప్రొసీజర్‌పై సామాన్య రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం లేదు. మరో వైపు కోర్టులు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక, ఆర్థిక స్తోమత లేక మరికొందరు సైలెంట్ అవుతున్నారు. ఇలాంటి వారినే బ్రోకర్లు టార్గెట్ చేస్తున్నారు. నిర్ణీత పరిహారం కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి తమ వైపు తిప్పుకుంటున్నారు. తర్వాత ఆఫీసర్లు, లీడర్ల సపోర్ట్‌తో తమ పని మొదలు పెడుతారు.
30 శాతం కమీషన్
తెలంగాణలో ఏదైనా ప్రాజెక్ట్ కోసం సేకరించే భూములకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుంది. ఆ ఏరియాలో గత మూడేండ్లలో జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకొని నష్టపరిహారం నిర్ణయిస్తారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ రేటుకు మూడింతల పరిహారంతో పాటు 100 శాతం సొలాటియం చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ ఎకరానికి రూ.5 లక్షలు అనుకుంటే నష్టపరిహారం రూ.15 లక్షలు, సొలాటియం మరో రూ.15 లక్షలు కలిపి మొత్తం రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకపోతే భూనిర్వాసితులు మార్కెట్ వాల్యూను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించడం గానీ, ఆర్బిట్రేషన్ కోసం కలెక్టర్ దగ్గర అప్లై చేసుకోవడం గానీ చేయాలి. ఈ తతంగమంతా బ్రోకర్లు, అధికారులు కలిసి నడిపిస్తున్నారు. ఆర్బిట్రేషన్ ద్వారా పెరిగిన మొత్తంలో 30 శాతం కమీషన్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ మేరకు ముందుగానే అగ్రిమెంట్ చేసుకొని నిర్వాసితుల నుంచి బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్నారు.
ఓసీపీలు, హైవేల కోసం భూసేకరణ
మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీపీ)లు, నేషనల్ హైవేల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతున్నారు. ప్రస్తుతం శ్రీరాంపూర్ ఓసీపీ ఎక్స్‌టెన్షన్‌లో భాగంగా జైపూర్ మండలంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఎన్‌హెచ్ 363 భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్‌హెచ్ 63లో భాగంగా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం 1400 ఎకరాలకు పైగా సేకరిస్తున్నారు. మంచిర్యాల, వరంగల గ్రీన్ ఫీల్డ్ హైవే 163 కోసం జిల్లాలో మరో 280 ఎకరాల భూ సేకరణ జరుగుతోంది. వీటన్నింట్లోనూ బ్రోకర్లు ఇన్‌వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఎన్‌హెచ్ 63కి సంబంధించి మంచిర్యాలకు చెందిన ఓ బ్రోకర్ కొంతమంది నిర్వాసితులతో అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ దందా ద్వారా కోట్లకు పడగలెత్తిన బ్రోకర్లు హైదరాబాద్, ఢిల్లీ లెవల్‌లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.