కుక్కకు కాంస్య విగ్రహం..వర్థంతికి పూజలు, అన్నదానం

కుక్కకు కాంస్య విగ్రహం..వర్థంతికి పూజలు, అన్నదానం

ఎవరైనా కావాల్సిన వాళ్లు,బంధువులు చనిపోతే నాలుగైదు రోజులు బాధపడుతాం..తర్వాత మనపని మనం చేసుకుంటాం. కానీ ఓ వ్యక్తి పెంపుడు కుక్కపై ప్రేమ పెంచుకున్న ఓ యజమాని  అది చనిపోయిన తర్వాత దాని జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు. సంవత్సరాలు గడిచినా మరిచిపోవడం లేదు. కుక్కకు విగ్రహం ఏర్పాటు చేసి,పూజలు చేసి దండలేసి..ప్రతి సంవత్సరం వర్ధంతి చేస్తున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడంటే.. 

ఏపిలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు  అనే వ్యక్తి  పెంచుకున్న కుక్కకు  శునకరాజు అని పేరుపెట్టాడు. దానిని కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు అది చనిపోయింది. అది ఈ లోకం విడిచి అయిదేళ్లయినా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ప్రతి సంవత్సరం దానికి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తమ పెంపుడు కుక్క జ్ఞాపకాలను మరచిపోలేని జ్ఞానప్రకాశరావు దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించాడు.5వ వర్ధంతి సందర్భంగా శునకరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయ బద్దంగా కుక్క ఆత్మకు శాంతి కలగాలని పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్క విగ్రహాన్ని పూలతో అలంకరించి పిండప్రదానం కూడా చేశారు. ఆ తర్వాత స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ రోజులు తమ కుటుంబంతో కలిసి జీవించిన సునకరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెట్టడం విశేషం.