- బేగంబజార్ లో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
బషీర్ బాగ్, వెలుగు : దంపతుల మధ్య గొడవలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. బావపై బామ్మర్దులు దాడి చేయగా.. ఐదుగురు నిందితులపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బేగంబజార్ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బేగంబజార్ తోప్ ఖానకు చెందిన రామేశ్వర్(39) , సంతోషి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.
రామేశ్వర్ కంప్యూటర్ హార్డ్ వేర్ గా చేస్తుంటాడు. దంపతుల మధ్య గొడవ అయినప్పుడల్లా భార్య ఉప్పుగూడలోని తల్లిగారింటికి వెళ్తుండేది. ఈనెల 2న సంతోషి తండ్రి ఉప్పల్ లో ఆర్టీసీ బస్సు కిందపడి చనిపోయాడు. అయితే.. తన చెల్లిని బావ పెట్టె ఇబ్బందులతోనే తీవ్ర మనోవేదనకు గురై చనిపోయాడని బామ్మర్దులు మనసులో పెట్టుకున్నారు. దశదినకర్మ ఉండగా ఈనెల 10న బేగంబజార్ లో వస్తువులు కొనేందుకు సంతోషి, ఆమె సోదరులు హరికృష్ణ, రామకృష్ణ, ముగ్గురు బంధువులు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తూ.. తోప్ ఖానలోని రామేశ్వర్ వద్దకు వెళ్లారు.
మీ గొడవల వల్లే తమ తండ్రి చనిపోయాడని, ఇకనైనా చెల్లిని బాగా చూసుకోవాలని బావ రామేశ్వర్ కు సర్దిజెప్పారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో సంతోషి, రామకృష , హరికృష్ణ, ఇతర కుటుంబసభ్యులు కలిసి రామేశ్వర్ పై కర్రలతో దాడి చేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అడ్డుకోబోయిన అతని తల్లి గంగబాయిని తోసేశారు.
దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తీవ్రగాయాలైన రామేశ్వర్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే బేగంబజార్ పోలీసులు వెళ్లి బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. రామేశ్వర్ తలకు19 కుట్లు పడ్డాయి. గంగుబాయికి ఎడమ కాలు విరిగింది. ఘటన జరిగి 8 రోజులైనా నిందితులు బయట దర్జాగా తిరుగుతున్నారని పోలీసులు అరెస్ట్ చేయలేదని బాధితుడు రామేశ్వర్ ఆరోపించారు.
ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ స్పందిస్తూ.. ఘటన జరిగిన వెంటనే వెళ్లి బాధితులను హాస్పిటల్ కు తరలించి, నిందితులపై సెక్షన్ 323 , 506 , 504 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. సంతోషి తన భర్తపై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులకు దాడి చేయించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయితున్నట్టు, అలాంటిదేమీ లేదని, దంపతుల మధ్య మనస్పర్థలతోనే గొడవ జరిగిందని ఇన్ స్పెక్టర్ వివరించారు.
