OTT Mystery: నీళ్ల కోసం బావి తవ్వితే బయటపడ్డ అస్థిపంజరం.. తెలుగులో ఓటీటీకి వచ్చిన తమిళ్ మిస్టరీ

OTT Mystery: నీళ్ల కోసం బావి తవ్వితే బయటపడ్డ అస్థిపంజరం.. తెలుగులో ఓటీటీకి వచ్చిన తమిళ్ మిస్టరీ

తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషియో-పొలిటికల్ కామెడీ డ్రామా ‘కెనతా కాణోమ్’(Kenatha Kanom) థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇవాళ (జూన్ 16) నుంచి జియోహాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సోషియో-కామెడీ డ్రామాలో నీటి సమస్య, బావుల తవ్వకం వంటి అంశాలను హాస్యంతో కూడిన కథాంశంగా తెరకెక్కించారు. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న ఓ గ్రామంలో తాగునీటి కోసం చేసే ప్రయత్నం ఊహించని మలుపు తిరుగుతుంది.

బావి తవ్వుతుండగా 66 మిలియన్ల ఏళ్ల నాటి డైనోసార్ అస్థిపంజరం బయటపడటంతో గ్రామం మొత్తానికి కొత్త సమస్యలు మొదలవుతాయి. దర్శకుడు సురేష్ సంగయ్య ఆలోచింపజేసే కథనం, ఆకట్టుకునే కామెడీతో రావడంతో సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. 

ఫుల్ స్టోరీ:

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కరవుతో సతమతమవుతున్న ఓ గ్రామంలో ఈ కథ సాగుతుంది. నీటి సమస్యపై గ్రామస్తుల మధ్య విభేదాలు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో, చివరకు గ్రామస్తులే బావి తవ్వాలని నిర్ణయించుకుంటారు. ఎట్టకేలకు గ్రామస్తులు బావి తవ్వుతారు.

అయితే నీటికి బదులుగా 66 మిలియన్ల ఏళ్ల నాటి డైనోసార్ శిలాజం బయటపడటంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత పురావస్తు శాఖ రంగంలోకి దిగడం, గ్రామాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించడం, గ్రామస్తులకు తక్కువ పరిహారం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. 

►ALSO READ | బొకే వద్దన్న సీఎం విజయ్.. ఆ డబ్బుతో ముగ్గురు బాలికల భవిష్యత్తుకు విశాల్ భరోసా

ఇదే సమయంలో ఒక సామాన్య పల్లెటూరి వాడికి తాగునీరు ముఖ్యం, కానీ ప్రభుత్వ యంత్రాంగానికి, పురావస్తు శాఖకు ఆ అస్థిపంజరం ముఖ్యం. ఈ రెండు భిన్నమైన ఇంటెన్షన్స్ మధ్య నడిచే బ్యూరోక్రసీ డ్రామాను దర్శకుడు అత్యంత హాస్యాస్పదంగా, అదే సమయంలో ఆలోచింపజేసేలా తెరకెక్కించారు.

ఎలా ఉందంటే:

యోగి బాబు పోషించిన మణివాసగం పాత్ర తనదైన హాస్యంతో, చురుకైన సంభాషణలతో ప్రేక్షకులను అలరిస్తాడు. పెళ్లిళ్లు కుదిర్చే బ్రోకర్, నీటి సమస్య కారణంగా సంబంధాన్ని తిరస్కరించే వధువు కుటుంబం, అప్పుగా ఇచ్చిన కొబ్బరికాయలపై గొడవపడే పొరుగువారు వంటి పాత్రలు సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ఇక పురావస్తు శాఖ జోక్యం, గ్రామాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించడం వంటి పరిణామాలతో కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కథనం కొంత ఊహించదగ్గ విధంగా ఉన్నప్పటికీ, నివాస్ కె. ప్రసన్న సంగీతం, గ్రామీణ నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. మొత్తంగా ‘కెనతా కాణోమ్’ ఓ ఆహ్లాదకరమైన గ్రామీణ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తుంది.