- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అమరుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం నాగర్ కర్నూల్ లో జరిగిన పార్టీ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ మీద ప్రజల వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సబ్ కా సాథ్– సబ్ కా వికాస్ నినాదంతో అన్నివర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
బీజేపీ అగ్రవర్ణాల పార్టీ కాదని, పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడిన పార్టీ అన్నారు. ఇది నెహ్రూ జమానా కాదు.. మోదీ జమానా అని, దేశ భద్రత, అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. బీజేపీ నేతలు నరేందర్ రావు, నాగేందర్ గౌడ్, తల్లోజు ఆచారి, భరత్ ప్రసాద్, జక్కా రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.
