- కుడా భూముల వేలంపై మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ సవాళ్లు, ప్రతిసవాళ్లు
- ఉదయం ఆలయం వద్దకు చేరుకొని ప్రమాణానికి
- సిద్ధమైన మర్రి యాదవరెడ్డి
- అదుపులోకి తీసుకొని తరలించిన పోలీసులు
- మధ్యాహ్నం ఆలయానికి వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేసిన ఇనుగాల వెంకట్రామిరెడ్డి
వరంగల్, వెలుగు : బీఆర్‍ఎస్, కాంగ్రెస్ లీడర్ల సవాళ్లు, ప్రతిసవాళ్లు, తడిబట్ట ప్రమాణాలతో ఓరుగల్లు భద్రకాళి ఆలయం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (కుడా) భూముల వేలంలో అవినీతి జరిగిందని బీఆర్ ఎస్ నేత, కుడా మాజీ చైర్ పర్సన్ మర్రి యాదవరెడ్డి ఆరోపిస్తుండగా... వేలం పారదర్శకంగానే జరిగిందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత చైర్ పర్సన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆరోపణలు కాస్తా ప్రమాణాల వరకూ వెళ్లాయి. శుక్రవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు ఆలయం వద్దకు చేరుకొని తడిబట్టలతో ప్రమాణం చేయడం, పోలీసులు అడ్డుకోవడంతో గుడి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కుడా భూముల వేలంతో మొదలై...
హనుమకొండ బస్టాండ్ సమీపంలోని ఏషియాన్ మాల్ వెనుక ఉన్న 2 ఎకరాల భూముల్లోని ప్లాట్లను కుడా ఆధ్వర్యంలో జూన్ 21న బహిరంగ వేలం వేశారు. వేలంలో ఒక్కో గజం రూ.75 వేల నుంచి రూ.96 వేల మధ్య పలికింది. కాగా, కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో అవినీతి జరిగిందని బీఆర్ ఎస్ నాయకులు, కుడా మాజీ చైర్ పర్సన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. గజం రూ.1.50 లక్షలు పలికే స్థలాన్ని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి రూ.66 వేల నుంచి రూ.69 వేలకు విక్రయించి, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై వారం రోజుల నుంచి బీఆర్‍ఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, విమర్శలు జరుగుతూనే ఉన్నాయి.
భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయాలంటూ...
కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న యాదవరెడ్డి గురువారం మరో అడుగు ముందకేశారు. 'అవినీతి జరిగిందని శుక్రవారం నేను భద్రకాళి గుడికి వచ్చి తడిబట్టల స్నానం చేసి అమ్మవారి మీద ప్రమాణం చేస్తా... మీరు అవినీతి చేయకపోతే తడిబట్టల స్నానం చేసి అమ్మవారి ముందు ప్రమాణం చేయండి. నిజాయతి పరులైతే సవాల్ స్వీకరించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి' అంటూ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి సవాల్ చేశారు.
చెప్పినట్లుగా శుక్రవారం ఉదయం బీఆర్‍ఎస్ నాయకులతో కలిసి భద్రకాళి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడే స్నానం చేసి తడిబట్టలతోనే ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే భక్తులు ఇబ్బంది పడుతున్నారని, ఆలయం వద్ద రాజకీయాలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నచ్చజెప్పారు. అయినా వినకపోవడంతో యాదవరెడ్డిని పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో బీఆర్‍ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బీఆర్ ఎస్ లీడర్లు ఆరోపించారు.
తడిబట్టలతో గుడిలోకి చైర్ పర్సన్ ఇనుగాల
కుడా ప్లాట్ల వేలంపై మీడియా, హోర్డింగ్స్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించామని, వేలం పారదర్శకంగా సాగిందని, బీఆర్‍ఎస్ నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ లీడర్ల తడిబట్టల ప్రమాణాన్ని స్వీకరిస్తున్నట్లు చెప్పి... శుక్రవారం మధ్యాహ్నం సమయంలో భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. బయట స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేసిన్రు : ఇనుగాల వెంకట్రామిరెడ్డి
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇనుగాల వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‍ఎస్ నేతలు పార్టీ ఆఫీస్ పేరుతో వందల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారని ఆరోపించారు. పారదర్శకంగా పనిచేస్తున్న తమపై అనుచిత విమర్శలు చేయడం సరికాదన్నారు. మర్రి యాదవరెడ్డి తడిబట్టల సవాల్ ను స్వీకరించి తాను ఆలయం వద్దకు వచ్చానని, కబ్జాలు, అవినీతి చేసిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో ఆ పార్టీ ఆఫీస్ కోసం ఇదే స్థలాన్ని కేటాయించుకున్నారని, కానీ డంప్ యార్డ్ ఉందని నిరాకరించారని గుర్తు చేశారు. వారు పనికి రాదని భావించిన స్థలాన్ని తాము బహిరంగ వేలం వేయడం ద్వారా హనుమకొండ బస్టాండ్, జవహర్‍లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి చేయాలని భావించామన్నారు.
