నెక్కొండ, వెలుగు : ఆన్లైన్గేమ్స్, బెట్టింగ్ లో భారీ మొత్తంలో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్జిల్లా నెక్కొండ మండలంలోని మూడుతండాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన కేలోతు బన్సీ, సారమ్మ చిన్న కొడుకు కేలోతు సురేశ్ (22) రెండేండ్లుగా ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఇంటి నిర్మాణం కోసం వస్తువులు తీసుకురావాలని సురేశ్ తల్లిదండ్రులు ఈ నెల 11న రూ. 50 వేలు ఇచ్చారు. అతడు పర్వతగిరి మండలంలోని ఓ వైన్స్ లో కూర్చొని మద్యం సేవిస్తూ మరోసారి ఆన్ లైన్ బెట్టింగ్ పెట్టి రూ. 50 వేలు పోగొట్టుకున్నాడు.
దీంతో తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడి తండ్రి బన్సీ ఫిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
