
- సభలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
- కేసీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు
- తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపణ
- తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై బీఆర్ఎస్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. విచారణ నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో శనివారం వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు (ఐఏ) దాఖలు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన బ్యారేజీల నిర్మాణాలపై న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిరుడు మార్చి 14న జారీ చేసిన జీవో 6 అమలును నిలిపివేయాలని కోరుతూ గతంలోనే వారిద్దరూ వ్యాజ్యాలను దాఖలు చేశారు.
కమిషన్ నివేదికపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోబోదని, అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టాక చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని ఐఏలో ప్రస్తావించారు. నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారని, ఈ నేపథ్యంలో ఐఏ దాఖలు చేయాల్సివచ్చిందని వివరించారు. కమిషన్ జులై 31న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే, పిటిషనర్లను కమిషన్ సాక్షులుగా పిలిచిందని, తీరా నివేదికలోని అంశాలను సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించడంతో పిటిషనర్లపై ఏకపక్ష అభియోగాలు ఉన్నట్లు తేలిందన్నారు.
పిటిషనర్లకు వ్యతిరేకంగా ఇతరులు ఎవరైనా సాక్ష్యాలు చెప్పినా, ఆధారాలు ఉన్నా.. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్–1952లోని సెక్షన్ 8–బి, 8–సి కింద కమిషన్ తమకు నోటీసులు ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమన్నారు. అభియోగాలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కమిషన్ కల్పించకపోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
విచారణ సాకుతో ఏ వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే హక్కు కమిషన్లకు ఉండదంటూ సుప్రీంకోర్టు పలు కేసుల్లో తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు. కమిషన్ నివేదికను సంక్షిప్తం చేయించి.. దానిని ఆధారంగా చేసుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 4న మీడియా సమావేశంలో పిటిషనర్లపై పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మీడియాలో తమకు వ్యతిరేకంగా ఫుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయన్నారు.
సీఎం చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి
సీఎం చర్యలు చట్ట వ్యతిరేకంగా, పిటిషనర్లపై కక్షపూరితంగా ఉన్నాయని పిటిషనర్లు కేసీఆర్, హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారికంగా ప్రభుత్వం సంక్షిప్తం చేయించిన నివేదికలోని అంశాలు తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాయని చెప్పారు. సీఎంగా, మంత్రిగా ఉండగా తాము తీసుకున్న చర్యలపై సీఎం రేవంత్ మాట్లాడిన అంశాలు తమస్థాయిని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. పక్షపాతంగా, ప్రతికూల ప్రభావాలను చూపనున్నాయని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించిందని, అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుంచి ప్రారంభం అయ్యాయని, 31న కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
ఈ నేపథ్యంలో ఐఏలో కోరుతున్న అభ్యర్థన మేరకు నివేదికపై శాసనసభలో చర్చించినప్పటికీ దాని అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 22న హైకోర్టు విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, కమిషన్ నివేదికపై తదుపరి చర్య అసెంబ్లీలో చర్చ తర్వాతే ఉంటుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ తర్వాత పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలనే రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్లపై చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారని చెప్పారు.
పిటిషనర్లపై చర్యలకు ఆస్కారం ఉంటుందని, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతున్నదని అన్నారు. ప్రధాన రిట్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి, తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. నివేదికను రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించాలని, అప్పటి వరకు పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా నీటిపారుదల శాఖ కార్యదర్శి, కాళేశ్వరం కమిషన్‌ను చేర్చారు. కాగా, ఐఏలపై తక్షణమే విచారణ జరిపి మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యర్థించే అవకాశం ఉంది.