ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ బుజ్జగింపులు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ బుజ్జగింపులు
  • ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో ఫామ్​హౌస్​​కు పిలిపించుకొని చర్చలు
  • మంచి రోజులొస్తాయని సముదాయింపు
  • 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో 4 గంటలకుపైగా మీటింగ్​

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతుండడంతో ఆ పార్టీ చీఫ్​కేసీఆర్​ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఉమ్మడి జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌజ్ కు పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు.   మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రేటర్​ హైదరాబాద్​లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు  టీ హరీశ్ రావు , వేముల ప్రశాంత్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టీ ప్రకాశ్ గౌడ్ , ఎమ్మెల్సీలు శేరి సుభాశ్​రెడ్డి , దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. కాగా, దానం నాగేందర్​పార్టీ మారినప్పుడు తాము  సీరియస్​గా తీసుకోలేదని, కానీ సీనియర్​నేతలు కడియం, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని తట్టుకోలేకపోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్​తో వాపోయినట్టు తెలిసింది.  

పోచారం శ్రీనివాస్​రెడ్డి పార్టీ వీడడాన్ని అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని, నాడు వైఎస్​హయాంలో ఇలాంటి పరిణామాలు జరిగినా కుంగిపోలేదని కేసీఆర్​చెప్పినట్టు తెలిసింది.  ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, భవిష్యత్తులో మనకు మళ్లీ అధికారం ఖాయమని ధీమా వ్యక్తంచేసినట్టు సమాచారం. గ్రేటర్​ హైదరాబాద్​నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోందని, ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని, ఎవరూ పార్టీని వీడొద్దని అన్నట్టు తెలిసింది. రేపటి నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా అందరు  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు జరుపుతానని కేసీఆర్​ పేర్కొన్నట్టు సమాచారం. కాగా,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయినా మాజీ మంత్రి హరీశ్​ రావు..రాత్రి వరకు ఫామ్ హౌజ్ లోనే కేసీఆర్ తో ఉన్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే పిలిచినట్టు తెలిసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోకల్​గానే ఉన్నా సమావేశానికి హాజరుకాలేదు.