Balakrishna : నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. 50 ఏళ్ల నట ప్రస్థానానికి IFFI వేదికపై సన్మానం!

Balakrishna : నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. 50 ఏళ్ల నట ప్రస్థానానికి IFFI వేదికపై సన్మానం!

నటసింహం నందమూరి బాలకృష్ణకు అరురైన , ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆయన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు.  గోవాలో గురువారం ( నవంబర్ 20న ) 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (International Film Festival of India - IFFI)  అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి.  నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ అత్యున్నత వేదికపై బాలయ్యకు ఈ సత్కారం లభించింది. 

 ప్రతిభకు దక్కిన పట్టాభిషేకం..

బాలకృష్ణ సినీ జీవితం 1974లో 'తాతమ్మ కల' చిత్రంతో ప్రారంభమైంది. అప్పటినుండి నేటి వరకు, ఆయన తన ప్రత్యేకమైన నటనతో, డైలాగ్ డెలివరీతో, విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 'లెజెండ్', 'నరసింహ నాయుడు', 'ఆదిత్య 369' 'అఖండ' వంటి చిత్రాలు ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు.. కేవలం కమర్షియల్ హీరోగానే కాకుండా, తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ వారసత్వాన్ని, తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎన్నో పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోశారు.

అంబరాన్ని తాకిన  సన్మానం ..

IFFI ప్రారంభ వేడుకలో గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌. మురుగన్‌, గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్‌ సావంత్‌ వంటి ప్రముఖుల సమక్షంలో బాలకృష్ణను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ సినిమాకు చేసిన కృషిని, ప్రభావాన్ని కొనియాడారు. బాలయ్య ఈ సన్మానం అందుకోగానే, సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఈ ప్రతిష్టాత్మక ఉత్సవంలో అనుపమ్‌ ఖేర్ వంటి ప్రముఖ నటులు కూడా పాల్గొన్నారు. నవంబర్ 20 నుంచి  28 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతాయి. ఈ  ముగింపు వేడుకలో, మరో దిగ్గజ నటుడు, 'సూపర్ స్టార్' రజనీకాంత్ కూడా తన 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానం అందుకోనున్నారు. బాలకృష్ణకు దక్కిన ఈ గౌరవం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కిన సన్మానంగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇది తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ప్రోత్సాహమే అని బాలయ్య అన్నారు..