హైదరాబాద్: వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్‌ను ఏమాత్రం సహించమని తేల్చి చెప్పారు. మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్, డేంజరస్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ అని స్పష్టం చేశారు. గురువారం (నవంబర్ 20) సిటీ ట్రాఫిక్ విభాగ పనితీరుపై బంజారాహిల్స్‌లో సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలపై సిబ్బందితో సీపీ నేరుగా చర్చించారు. ట్రాఫిక్ పోలీసింగ్‌ను మెరుగుపరచడానికి కొత్త సూచనలు, మార్గదర్శకాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ పోలీస్ ముఖచిత్రమని ప్రశంసించారు. ఉన్నత పనితీరు చూపిన సిబ్బందికి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి నెల 27 నుంచి అన్ని శాఖలతో కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
యూటర్న్స్‌పై శాస్త్రీయ అధ్యయనం కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రియల్ టైం ట్రాఫిక్ మానిటరింగ్‌ను మరింత బలపరచాలని ఆదేశించారు. సాంకేతికత వినియోగంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కార ప్రణాళిక రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ట్రాఫిక్ అధికారులు సంఘటన స్థలానికి తప్పనిసరిగా వెళ్లాలని సూచించారు. త్వరలో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో 450 మంది ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
