- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి త్వరలో ముహూర్తం
- ప్రజా పాలన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం
- అలాట్ చేయని 59,600 ఇళ్లను గుర్తించిన అధికారులు
- వచ్చే నెలాఖారుకల్లా పంపిణీ చేస్తామని కేంద్ర మంత్రికి సమాచారం
- వీటి పంపిణీ చేస్తేనే.. కేంద్రం నుంచి రూ. 400 కోట్ల నిధులకు మోక్షం
హైదరాబాద్, వెలుగు: లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి హౌసింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 59,400 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 22 వేల ఇళ్లు ఉన్నాయి.
ప్రజా పాలనలో అప్లికేషన్లు పెట్టుకొని, సొంత జాగా లేని పేదలకు ఈ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అప్లికేషన్లను ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. సొంత జాగా ఉండి, ఇల్లు లేనివారిని ఎల్1లో, సొంత జాగా, ఇల్లు లేనివారిని ఎల్2లో, తాత్కాలిక ఇల్లు ఉన్నవారిని, ఇతరులను ఎల్3లో చేర్చారు. వీరిలో ఎల్2లో ఉన్నవారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే నెలాఖరులోగా పూర్తి
డబుల్ ఇళ్ల పంపిణీని వచ్చే నెలాఖరులోగా పూర్తి చేస్తామని హౌసింగ్ అధికారులు అంటున్నారు. దీనిపై ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్, హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు, కేంద్ర అధికారులకు రాష్ట్ర హౌసింగ్ అధికారులు నివేదిక అందజేశారు. ఈ ఇళ్లను పంపిణీ చేసిన తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి పీఎం ఆవాస్ యోజనలో అర్బన్, రూరల్ ఇళ్లకు సంబంధించిన బకాయిలు రూ.400 కోట్లు కేంద్రం నుంచి విడుదల చేయాలని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ఏడాది ఈ ఫండ్స్ ను కేంద్రం ఇస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ఫండ్స్ వస్తే ఇందిరమ్మ స్కీమ్ కు ఖర్చు చేయనున్నారని, దీంతో రాష్ట్రంపై కొంత ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.
ఇండ్లు కట్టి.. పంపిణీ చేయని గత సర్కారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో 100 శాతం సబ్సిడీతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్కీమ్ ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్లు, జిల్లాల్లో1 లక్షా 72 వేల ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో 1 లక్షా 98 వేల ఇండ్లు పూర్తి కాగా, ఇందులో 1 లక్షా 48 వేల ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా 59 వేల ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. మరో 29 వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.
వేలాది డబుల్ బెడ్ రూం ఇండ్లు రెండు, మూడేండ్లుగా ఖాళీగా ఉండటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. అలాగే చాలా చోట్ల ఇండ్ల కిటికీలు, తలుపులు డ్యామేజ్ అయ్యాయి. దీంతో కొన్ని చోట్ల లబ్ధిదారులు వెళ్లి ఇండ్లను ఆక్యుపై చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డబుల్ ఇండ్లకు రిపేర్లను చేపట్టింది. త్వరలోనే ఆ ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నది.
అసంపూర్తి ఇండ్లు పంచి.. ఆర్థిక సాయం
ప్రభుత్వం పంపిణీ చేయనున్న డబుల్ ఇండ్లలో పూర్తయిన ఇండ్లతో పాటు సగం పనులు పూర్తి అయిన ఇండ్లను సైతం లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా పూర్తయిన ఇండ్లకు బ్యాలెన్స్ వర్క్ ఎంత చేయాల్సి ఉందో అన్న అంశంపై హౌసింగ్ అధికారులు ఇంటి పూర్తికి అయ్యే ఖర్చును అంచనా వేసి లబ్ధిదారుడికి అందచేయనున్నారు.
ఒక్కో ఇంటి ఖరీదు రూ.5 లక్షలుగా అంచనా చేసి, అందులో పూర్తయిన ఇంటికి అయిన ఖర్చు, మిగతా పనికి అయ్యే ఖర్చును అధికారులు అంచనా వేయనున్నారు. దీంతో లబ్ధిదారుడు దగ్గరుండి ఆ ఇంటిని పూర్తి చేసుకుంటాడని అధికారులు చెబుతున్నారు.
