ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం (నవంబర్ 21) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బౌన్సీ వికెట్ ఉన్న పెర్త్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఒక రోజు ముందే తమ ప్లేయింగ్ 11 ప్రకటించింది. మరోవైపు ఇంగ్లాండ్ తమ 12 మందితో కూడిన స్క్వాడ్ ను అనౌన్స్ చేసింది. ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హేజల్ వుడ్ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ లో ఫాస్ట్ బౌలింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు సమాచారం.
తొలి టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇంగ్లాండ్ ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. బుధవారం (నవంబర్ 19) ప్రకటించిన 12 మంది స్క్వాడ్ లో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్,బ్రైడాన్ కార్స్, గస్ అట్కిన్సన్ లతో కూడిన నలుగురు పేసర్లకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చోటు కల్పించనుందని టాక్. ఈ నలుగురు పేసర్లకు తోడు స్టోక్స్ ఎలాగో ఉన్నాడు. పెర్త్ స్టేడియంలో బౌన్సీ వికెట్ కావడంతో స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ మ్యాచ్ లో బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజాతో పాటు జేక్ వెదరాల్డ్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడు. వెదరాల్డ్ కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. మార్నస్ లాబుస్చాగ్నే తనకు కలిసొచ్చిన మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. కమ్మిన్స్ లేకపోవడంతో తొలి టెస్టుకు స్మిత్ ఆసీస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ట్రావిస్ హెడ్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ వరుసగా 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఏకైక స్పిన్నర్ గా నాథన్ లియాన్ ఆడతాడు. మిచెల్ స్టార్క్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ లు ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు.
►ALSO READ | Smriti Mandhana: ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసిన స్మృతి మంధాన.. వీడియో వైరల్
ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు దూరం కావడంతో ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో విజయం సవాలుగా మారింది. డిసెంబర్‌లో బ్రిస్బేన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు కమ్మిన్స్, హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది.
ఇంగ్లాండ్ స్క్వాడ్:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), బ్రైడాన్ కార్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.
