హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు తగ్గబోతున్నాయ్.. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహం ఇదే..

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు తగ్గబోతున్నాయ్.. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహం ఇదే..

భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇటీవల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా ఇండియాలో వైద్య ద్రవ్యోల్బణం 11.5% దాటింది. ఇది ప్రపంచంలో అత్యధిక స్థాయి. అయితే అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం చేరువ చేసేందుకే జీఎస్టీ సున్నాకు తగ్గించినప్పటికీ రేట్ల పెంపులు లక్ష్యాలకు అడ్డంకిగా మారుతున్నట్లు మోడీ సర్కార్ భావిస్తోంది. ఆసుపత్రి చికిత్స, ఔషధ ధరలు, వైద్య పరికరాల ఖర్చులు పెరుగుతున్నందున, ప్రజలకు ఇన్సూరెన్స్ ప్రీమియం భారమైందని కేంద్రం భావిస్తోంది. ఏకపక్షంగా రేట్ల పెంపును సహించేది లేదని కేంద్రం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI కు పంపించింది. వాటిలో ముఖ్యమైనవి ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఏజెంట్ కమిషన్‌ను గరిష్టంగా 20%కు పరిమితం చేయడం మెుదటిది కాగా.. పాలసీ రెన్యూవల్ సమయంలో ప్రీమియంపై 10%కు మించి కమిషన్ ఇవ్వకుండా నియంత్రణ పెట్టాలని భావిస్తోంది. దీనికి తోడు ముఖ్యంగా ఆసుపత్రుల చికిత్స ప్యాకేజీ ధరలను నియంత్రించడం కూడా ప్రతిపాదించబడింది. వీటికి ఆమోదం లభిస్తే రానున్న రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాల పెరుగుదలపై నియంత్రణ సాధ్యపడనుంది. 

ఇదే సమయంలో ‘నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్’ అనే కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా ప్రతి క్లెయిమ్, బిల్, డిశ్చార్జ్ సమ్మరీ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా డిజిటల్‌గా రికార్డ్ కానుంది. హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్యాకేజీ రేట్లు ఏకపక్షంగా నిర్ణయించకుండా రూల్స్ కూడా కేంద్రం తీసుకురావాలని నిర్ణయించింది. హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తమ లాభాలు తగ్గాయని.. ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు అమ్మి సొమ్ము చేసుకుని చివరికి క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తున్నాయని తమ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలంటూ ప్రభుత్వానికి మెురపెట్టుకుంటున్నాయి. చాలా సందర్భాల్లో క్లెయిమ్‌ల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నాయని కూడా ఆరోపించారు. సమస్య పరిష్కారానికి డిజిటల్ నేషనల్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ అవసరమని కోరుతున్నాయి. 

►ALSO READ | TCS పై గెలిచిన టెక్కీ: కంపెనీ ఒత్తిడితో రాజీనామా.. కానీ గ్రాట్యుటీ ఇవ్వాలని ఆదేశం..

హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోవటం అంటే కేవలం వైద్య ఖర్చులను తగ్గించే సాధనం మాత్రమే కాదు.. అది ఒక ఆర్థిక రక్షణ గోడ అని ప్రజలు గుర్తించాలి. యాక్సిడెంట్, వ్యాధి, లేదా దెబ్బలు తగిలినప్పుడు పెద్ద మొత్తంలో అయ్యే ఆసుపత్రి ఖర్చులను ఇన్సూరెన్స్ ద్వారా ఎదుర్కోవచ్చు. కానీ ప్రీమియమ్స్ అధికంగా ఉంటే.. సాధారణ ప్రజలకు ఇది చేరనంత దూరం అవుతుందని మధ్యతరగతి భారతీయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజా కేంద్ర ప్రభుత్వ చర్యలు రానున్న రోజుల్లో ప్రజలకు తక్కువ ధరలకే పాలసీలు అందేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.