ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో చాలా మంది ఉద్యోగులను తీసేశారు. ఇందులో ఉద్యోగులపై ఒత్తిడితో బలవంతపు రాజీనామాలు, ఎలాంటి చర్య లేకుండా ఉద్యోగాల నుండి పంపించేయడం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి ఒక కేసులో ముంబైకి చెందిన TCS ఉద్యోగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏడేళ్లకు పైగా పనిచేసిన ఓ ఉద్యోగిని ఒత్తిడి చేసి బలవంతంగా ఉద్యోగం నుండి తీసేశారు, అంతేకాక అతనికి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ డబ్బును కూడా కంపెనీ ఇవ్వలేదు.
ముంబై లేబర్ ఆఫీస్ వద్దకి ఈ విషయం చేరడంతో ఉద్యోగికి మళ్లీ ఉద్యోగం రాకపోయినా, అతనికి ఇవ్వాల్సిన ఫుల్ గ్రాట్యుటీ మొత్తాన్ని ఇవ్వాలని TCSను ఆదేశించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) అనే సంస్థ Xలో షేర్ చేసింది.
ALSO READ : భారత రక్షణ బలోపేతానికి అమెరికా అండ:
వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఓ ఉద్యోగి ఏడు సంవత్సరాలుగా TCSలో పనిచేస్తున్నాడు. అతని తండ్రి ICUలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్నాడు. కానీ అదే సమయంలోనే కంపెనీ అతనిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయమని బలవంతం చేసింది.
అతనికి సెలవులు ఉన్నా కూడా, ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడటం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చిందని ఉద్యోగి ఆరోపించాడు. కంపెనీలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రతి ఉద్యోగికి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ చెల్లింపులను కూడా TCS ఆపేసింది.
దింతో ఉద్యోగి తనకు న్యాయం చేయాలని కోరుతూ ముంబై లేబర్ ఆఫీస్‌కు చేరాడు. తర్వాత అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలని TCS ప్రతినిధులను పిలిపించగా..... కేసును సరిగ్గా పరిశీలించిన తరువాత, ఉద్యోగి పనిచేసిన పూర్తి కాలానికి గ్రాట్యుటీని చెల్లించాలని లేబర్ కమిషనర్ TCSను ఆదేశించింది. అలాగే ఇలాంటి అన్యాయమైన పద్ధతులను (అన్-ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్) ఆపాలని కంపెనీని హెచ్చరించారు.
FITE చెప్పిన దాని ప్రకారం ఉద్యోగికి ఇప్పుడు రావాల్సిన డబ్బు అందుతుంది. TCS పై ఈ విజయం మీ హక్కుల కోసం పోరాడటానికి ఉద్యోగులను గుర్తు చేస్తుంది. కంపెనీ ఉద్యోగులు మీ హక్కులను తెలుసుకోవడం, అలాగే అన్యాయమైన పద్ధతులపై లేబర్ అధికారులు జోక్యం చేసుకోగలరని గుర్తించడం చాలా ముఖ్యం.
