రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర.. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర.. బాల్క సుమన్  వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  • అధికారం కోల్పోయాక బీఆర్ఎస్​లో అసహనం పెరిగింది
  • సింగరేణి ఆస్తులను కాలబెట్టాలనడమంటే తెలంగాణ 
  • ఆర్థిక వ్యవస్థపై దాడిచేయడమే 
  • బాల్క సుమన్ ​వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​

న్యూఢిల్లీ, వెలుగు: అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోతున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరుస ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, అందుకే సమాజంలో హింస, అరాచకం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, సింగరేణి భవనాలు కాలబెట్టాలని, రైల్వే పట్టాలు కోయాలని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టాయని మండిపడ్డారు.

ఈ మేరకు బాల్క సుమన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలని చెప్పడమంటే.. తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడిచేయడమేనని విమర్శించారు.‘ఇవి కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాదు.. చట్టవ్యతిరేక చర్యలను బహిరంగంగా ప్రేరేపించడమే. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి చర్యలు.. ప్రజల ప్రాణా లకు, దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయి. 

ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కిషన్​ రెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తమ రాజ కీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను రెచ్చగొడుతూ సమాజంలో అశాంతి సృష్టించే రాజకీయాలు చేస్తున్నాయని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పార్టీల నుంచి అభివృద్ధిని ఆశించలేమన్నారు. ‘తెలం గాణలో హింసా రాజకీయాలకు స్థానం లేదు. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ మార్గాల్లోనే పోరాటం చేయాలి. 

కానీ యువతను ‘మిలిటెంట్ యాక్టివిటీ’ పేరుతో రెచ్చగొట్టడం అత్యంత ప్రమాదకరం. ఇది సమాజాన్ని అశాంతి వైపు నెట్టే కుట్ర’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగానే.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదన్నారు. తెలంగాణలో శాంతి, అభివృద్ధి, బాధ్యతాయుత రాజకీయాల కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తున్నదన్నారు.